కోహీర్, మార్చి 12: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని, రైతుభరోసా ఇవ్వకుం డా కర్షకులపై చిన్నచూపు చూస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గురువారం ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొనింటి మాణిక్‌రావుతో కలిసి హరీశ్‌రావు ఆకస్మికంగా తనిఖీ చేసి లాగ్‌బుక్‌లు పరిశీలించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రైతుల ఉసురు పోసుకుంటున్నారని విమర్శించారు. రైతుభరోసా ఇవ్వకుండా, సరిగ్గా కరెంట్ సరఫరా చేయకుండా, సాగునీళ్లు ఇవ్వకుండా, సరిపడా యూరియా పంపిణీ చేయకుండా రైతులను అరిగోస పెడుతున్నదన్నారు.
అసెంబ్లీ సాక్షిగా కరెంట్ సరఫరాపై సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారని, తన తప్పును ఆయన ఒప్పుకోవాలని, రైతులంటే సీఎం రేవంత్‌రెడ్డికి చిన్నచూపు ఎందుకని అన్నారు. రైతుల వ్యవసాయానికి 24గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చెబుతున్నారని, కానీ.. 13గంటలు సరఫరా చేస్తున్నారని అన్నారు. ఇందులో కూడా లైన్ క్లియర్, ట్రిప్పులు కావడం, తదితర కారణాలతో రోజుకు మరో గంట కరెంట్ సరఫరా తగ్గుతున్నదన్నారు. రోజుకు 12గంటలు మాత్రమే ప్రభుత్వం సరఫరా చేస్తున్నదన్నారు. లాగ్‌బుక్ ఆధారంగానే తాను చెబుతున్నానని హరీశ్‌రావు తెలిపారు.
ఎంతకాలం రైతులను మోసం చేస్తారని మండిపడ్డారు. పంటల బీమా, మూడు పంటలకు కలిపి రైతుబంధు కింద రూ.20వేల కోట్లను ఎగబెట్టారని విమర్శించారు. రైతుబంధు ఇవ్వకుండా రైతులకు రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పడం సిగ్గుచేటన్నారు. విద్యుత్ డిస్కంలకు రూ.55వేల కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం డిస్కంలకు చెల్లించడం లేదన్నారు. ఇండ్లకు, వ్యవసాయానికి విద్యుత్ మీటర్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ కొత్త కనెక్షన్ ఇవ్వాలన్నారు. కేసీఆర్ హయాంలో రూ.4.900 కొత్త మీటర్ కనెక్షన్ లభించేదన్నారు. కానీ, రేవంత్ ప్రభుత్వం రూ.9.700 వేలకు పెంచిందని మండిపడ్డారు. తాము 24గంటల విద్యుత్ సరఫరా చేయడం లేదని రేవంత్‌రెడ్డి లెంపలు వేసుకోవాలన్నారు.
కరెంట్ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19647 మంది ఆర్టిజన్లను వెంటనే పర్మినెంట్ చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఆర్టిజన్ల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. అనంతరం కోహీర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కౌన్సిలర్లను హరీశ్‌రావు సన్మానించారు. అంతకుముందు మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొనింటి మాణిక్‌రావుకు కొత్తూర్(డి) గ్రామ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహులు, కౌన్సిలర్లు కలీం, సంపత్‌కుమార్, చాంద్, మాజీ సర్పంచ్ రాజశేఖర్, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ రామకృష్ణారెడ్డి, బక్కారెడ్డి, సందీప్, అస్లాం, వాజిద్, తదితరులు పాల్గొన్నారు.