రైతుల పంట రుణమాఫీ ప్రకటనతో సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అన్నదాతలు, బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలు, ఫ్లెక్సీలకు క్షీరాభిషేకాలు చేశారు. పటాకులు కాల్చి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. రైతుల సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ రైతు బాంధవుడు అని కొనియాడారు. రైతును రాజును చేయడమే లక్ష్యంగా రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్‌లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడంతో పాటు పంటలను కొనుగోలు చేసి అన్నివిధాలా అండగా నిలబడుతున్నారని ప్రశంసించారు.

రుణమాఫీ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని.. రైతులంతా ఎంతో సంతోషంగా ఉన్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావుతో కలిసి ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, మాణిక్‌రావు, భూపాల్‌రెడ్డిలు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. జోగిపేటలో అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో, శివ్వంపేట మండలం ఉసిరికపల్లిలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జహీరాబాద్ పట్టణంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎం. శివకుమార్ సమక్షంలో ఆర్అండ్బీ గృహం నుంచి ప్రధాన రోడ్డు వరకు భారీ ర్యాలీ చేపట్టారు.
– సంగారెడ్డి/ మెదక్, న్యూస్ నెట్వర్క్, ఆగస్టు 3

పంట రుణ మాఫీ అమలు సంపూర్ణం చేసే దిశగా సర్కారు చర్యలు మొదలు పెట్టింది. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కో రైతు కుటుంబానికి లక్ష రూపాయల వరకు రుణ మాఫీ జరుగుతున్నది. అర్హులైన రైతులందరికీ విడతల వారీగా రుణమాఫీ డబ్బును వారి ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ సంబంధిత శాఖల మంత్రికి, సిబ్బందికి ఆదేశించారు. 45 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేశారు. లక్ష రూపాయల వరకు రుణం తీసుకున్న రైతులకు ప్రయోజనం చేకూరుతున్నది. దీంతో మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని వేనోళ్ల పొగుడుతున్నారు. ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలన్నీ సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని ప్రశంసిస్తున్నారు. గురువారం మెదక్, సంగారెడ్డి జిల్లాల వ్యాప్తంగా రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకొని, మిఠాయిలు తినిపించుకున్నారు.
– సంగారెడ్డి/మెదక్ జిల్లా న్యూస్ నెట్ వర్క్, ఆగస్టు 3

రుణమాఫీ చేసి రైతుల గుండెల్లో సీఎం కేసీఆర్ గుడి కట్టుకున్నడు. ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేసిండు. ఈ నిర్ణయం రైతుల్లో మనోధైర్యాన్ని నింపింది. ఇది చారిత్రత్మాక నిర్ణయం. కాంగ్రెసోళ్ల మాటలు ఎవరూ నమ్మరు. రైతులకు సీఎం అండగా నిలిచారు. సీఎం కేసీఆర్‌కు రైతులంతా కలిసి అండగా నిలుస్తాం.
– లక్ష్మణ్‌నాయక్, రైతు, కరస్‌గుత్తి, నాగల్గిద్ద

రాష్ట్రంలో ఉన్న రైతులకు కేసీఆర్ సార్ ఆదర్శప్రాయుడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రుణమాఫీ చేస్తానని, ఇప్పుడు చేసిండు. ఆయన అసుంటి మంచి మనిషి మనకు దొరుకుడు అదృష్టం. ఆ సార్ పుణ్యామా అని బ్యాంకు లో ఉన్న బాకీ మొత్తం తీరిపోతున్నది. మేము అప్పులు లేకుండా ఉంటాం. సీఎం కేసీఆర్‌కు మా కుటుంబం తరఫున కృతజ్ఞతలు.
– మాసుల యాదగిరి, రైతు, రామాయంపేట
దండగ అన్నట్లున్న ఎవుసంకు పెట్టుబడి, కరెంట్, సాగునీరు, ఎరువులు, విత్తనాలు ఇలా అన్నీ ఇచ్చి పండుగలా చేసిండు కేసీఆర్ సారు. సారు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. రుణమాఫీతో నాలాంటి ఎంతో మంది రైతులకు మేలు జరుగుతున్నది. సీఎం కేసీఆర్ సార్‌కు రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నా.
– పూర్ణచందర్, యువరైతు, ఖలీల్పూర్, న్యాల్కల్

తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ సారును నా జిందగీలో మరువను. బ్యాంకులో ఉన్న నా బాకీలు తీసేస్తున్న ఆయన మా దేవుడు. ఆయనలా మాటమీద నిలబడే సీఎం మనకు దొరకడు. ఇచ్చిన మాట ప్రకారం లక్ష రూపాయలు బాకీ ఉన్నోళ్లందరివీ తీసేస్తానన్నడు. తీసేస్తున్నడు. మా కుటుంబం ఆయనకు రుణపడి ఉంటాం. రైతులంతా ఆయన దిక్కే ఉంటరు.
– వీరబోయిన ఆంజనేయులు, రైతు, రామాయంపేట
కేసీఆర్ చేసిన పంట రుణమాఫీ ప్రకటనతో రైతుల్లో సీఎంపై మరింత భరోసా పెరిగింది. రుణమాఫీ చెల్లింపుల కోసం వెంటనే ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల చేయడం అభి నందనీయం. సంగారెడ్డి జిల్లాలో 44,870 మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. దీంతో రైతులంతా ఆనందంగా ఉన్నారు. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు.
– వెంకటేశంగౌడ్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, జిన్నారం

తెలంగాణలో రైతులు అప్పుల పాలు కావద్దనే సీఎం రుణమాఫీ చేసిండు. ఏ ముఖ్యమంత్రి చేయని సాహసం మన సీఎం కేసీఆర్ సార్ చేస్తున్నడు. రైతులంతా ఈసారి మద్దతు పలకాలే. తెలంగాణ ప్రజల గురించి ఎవ్వరు ఇంత ఆలోచించలేదు. కాంగ్రెసోళ్లు చెప్తరు గానీ చెయ్యరు. కేసీఆర్ సార్ అట్లగాదు కచ్చితంగా అప్పు మాఫీ చేస్తడు.
– కిషన్, రైతు, సుతారిపల్లి రామాయంపేట

దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ రైతుల అభివృద్ధి, సంక్షేమానికి ఎనలేని కృషి చేస్తున్నారు. రైతు సంక్షేమంలో తెలంగాణ ప్రభుత్వానికి తిరుగులేదు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి రైతుల రుణాలు మాఫీ చేశారు. వ్యవసాయం తెలిసిన వ్యక్తిగా అనేక పథకాలు తీసుకొస్తున్నారు. సీఎం కేసీఆర్‌ను రైతులు జీవితాంతం మరిచిపోరు.
– ఎంఆర్ ప్రవీణ్‌కుమార్, పీఏసీఎస్ డైరెక్టర్, హద్నూర్, న్యాల్కల్

ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ చేసిన రుణమాఫీతో బ్యాంకులో ఉన్న మా బాకీ తీరింది. ఆయన రైతులందరికీ దేవుడు. ఆయన పుణ్యంతోనే నేడు వ్యవసాయం లాభసాటిగా మారింది. రైతులకు సాగులో ఆర్థికంగా అన్ని విధాలా సాయం చేస్తున్నాడు. దీంతో కొంత ఆర్థికంగా బలపడుతున్నం. మాకోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తున్న సీఎం కేసీఆర్ మాకు దేవుడు.
-ఎడ్ల నర్సింహ్మారెడ్డి, రైతు, నందిగామ రామాయంపేట