నాటికి.. నేటికీ జమీన్ ఆస్మాన్ ఫరక్
గింత పంట ఉత్తగనే పండడం లేదు..
ఇంటింటికీ సీఎం కేసీఆర్ ఫలాలు అందుతున్నాయి..
తెలంగాణ రాష్ట్రం రాక ముందు నీళ్లు లేక, పంటలు పండక చానా ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు ఎటుచూసినా పచ్చని పొలాలు, నీళ్లతో జిల్లా పచ్చగ మారిందని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ రంగంలో చూసినా తొమ్మిదేండ్ల కిందటితో పోలిస్తే నేడు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దండుగ అని మాట్లాడేవారు రాష్ట్రంలో 60లక్షల ఎకరాల్లో వరి పంట ఎలా పండుతుందో సమాధానం చెప్పాలన్నారు. ఎండకాలంలో చెరువులు మత్తడి దుంకుతున్నాయంటే ఎలా సాధ్యమైందో ఒకసారి ఆలోచన చేయాలన్నారు. బీజేపీ వాళ్లు తిట్టడం తప్ప.. రైతుల మీద ప్రేమ లేదని బండి సంజయ్‌ను ఉద్దేశించి మంత్రి ఎద్దేవా చేశారు. చివరిశ్వాస వరకు మీ కోసమే పనిచేస్తానన్నారు. తెలంగాణ పథకాల గురించి మాట్లాడితే ఏపీ మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారన్నారు. గడపగడపకూ సీఎం కేసీఆర్ అమలు చేసిన ఫలాలు అందుతున్నాయన్నారు.
– సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 17
చివరి శ్వాస వరకు సిద్దిపేట కోసం పనిచేస్తా..
నాడు సిద్దిపేట ఎలా ఉంది… నేడు ఎలా ఉందో ఒకసారి ఆలోచించాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గ్రామాల్లో ఈ విషయాలపై చర్చ పెట్టాలన్నారు. ఒక్కొక్కటిగా సిద్దిపేటకు అన్ని చేసుకుంటున్నామని.. భవిష్యత్‌లో ఇంకా అభివృద్ధి చేసుకుందామన్నారు. ఏ రంగంలో చూసినా తొమ్మిదేండ్ల కింద నేడు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందన్నారు. నాటి కాంగ్రెస్ పాలనకు, నేటి బీఆర్ఎస్ పాలనకు ఏమైనా పొంతన ఉందా అన్నారు. అభివృద్ధి సాధించామన్నారు. గడపగడపకూ సీఎం కేసీఆర్ అమలు చేసిన ఫలాలు అందుతున్నాయన్నారు. గతంలో మునుగోడు ఎన్నికలకు వెళ్లినపుడు ఓ సర్పంచ్ గ్రామాల్లో అత్తాకోడండ్ల పంచాయితీలు తగ్గాయని చెప్పినట్లు గుర్తు చేశారు. పింఛన్, రేషన్ బియ్యం రావడం వల్ల అత్తలను మంచిగ చూసుకుంటున్నారని చెప్పారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా బాల్య వివాహాలు తగ్గిపోయాయన్నారు. ఎప్పుడూ మీ ప్రేమ ఆశీర్వాదం ఇచ్చారని.. భవిష్యత్‌లో కూడా ఇలాగే ఉండాలని.. ఇంకా మీ సేవలో పని చేస్తానన్నారు. నా జీవితమంతా సిద్దిపేట ప్రజల సేవకే అంకితమని..చివరి శ్వాస వరకు తప్పకుండా మీ కోసమే పని చేస్తానని మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు.
బీజేపీకి బూతు మాటల మీద ప్రేమ తప్ప రైతుల మీద లేదు
బీజేపీ వాళ్లకు బూతుల మీద ప్రేమ తప్ప.. రైతుల మీద ప్రేమ లేదని బండి సంజయ్‌ను ఉద్దేశించి మంత్రి ఎద్దేవా చేశారు. ప్రజలకు పనికొచ్చే మాటలు, పనులు ఒక్కటి కూడా ఉండవన్నారు. ఎంతసేపు రాజకీయం, బూతులు తప్ప మంచిపని చేసే ఆలోచనే ఉండదన్నారు. బీజేపీ వాళ్లది పథకాల్లో కోత,చార్జీల మోత అన్నారు. ఉపాధి హామీల్లో కోతలు పెట్టి.. పెట్రో, డీజిల్ ధరలు పెంచి ధరల మోత మోగించారన్నారు. సంతోషమే సగం బలం నాటి పెద్దల మాట అయితే.. సంక్షేమమే సగం బలం అనేది నేటి మన సీఎం కేసీఆర్ మాట అన్నారు. సంపద పెంచి పేదలకు పంచాడన్నారు. ఒకవైపు అభివృద్ధి చేస్తూనే మరోవైపు సంక్షేమంపై కేసీఆర్ దృష్టి సారించారన్నారు.
సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 17 : ‘నాడు సిద్దిపేట అంటే కరువు.. నేడు కల్పతరువని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో సోమవారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. అంతకు ముందు రంగధాంపల్లి అమరవీరుల స్తూపం నుంచి మిట్టపల్లి సభాస్థలి వరకు బీఆర్ఎస్ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. గ్రామంలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ ఎన్నికలు దగ్గరకు వచ్చాయని బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు మనపై నిందలు వేస్తున్నారని, ఢిల్లీలో ఉన్న వారికి హైదరాబాద్‌లో ఉన్న వారికి మనం ఏంచేస్తున్నామో అర్థం కాదని.. ఊర్లకు వచ్చి చూస్తే అర్థమవుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ దండుగ అని మాట్లాడేవారు 60 లక్షల ఎకరాల్లో వరి పంట ఎలా పండుతుందో సమాధానం చెప్పాలన్నారు. ఎండకాలంలో కూడా తడ్కపల్లి, ఎన్సాన్పల్లి చెరువులు మత్తడి దుంకుతున్నాయన్నారు. ఇక్కడి రైతులను అడిగితే కాళేశ్వరం పండుగనా.. దండుగనా తెలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లా, సిద్దిపేట అర్బన్ మండలం కాకపోతుండే.. రైలు, గోదావరి నీళ్లు ఇలా ఏవీ రాకుండే, ఇది కేసీఆర్ వల్లనే సాధ్యమైందన్నారు.
ఒకనాడు సిద్దిపేట ట్యాగ్ లైన్‌గా నీళ్లు, రైలు, జిల్లా అనే అంశాలు ఉండేవన్నారు. నాడు ఎంపీగా ఉన్న నంది ఎల్లయ్య చాలా సార్లు చెప్పినా పని కాలేదని, కానీ సీఎం కేసీఆర్ వల్లనే ఇవన్నీ జరిగాయన్నారు. తెలంగాణ రాకముందు అర్బన్ మండలంలో ఎకరానికి 5 లక్షలు ఉంటే నేడు కోటి ఉందన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం సిద్దిపేటకు ఒక హైటెక్ సిటీగా మారిందన్నారు. అర్బన్ మండలం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు. జాతీయ రహదారి రావడంతో మిట్టపల్లితో పాటు మరిన్ని గ్రామాలకు లబ్ధిచేకూరుతుందన్నారు. బట్టర్ఫ్లై లైట్లతో పాటు అండర్‌పాస్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నామన్నారు. నాడు సిద్దిపేట జిల్లాలో రూ.30 కోట్ల విలువ గల ధాన్యం పండితే నేడు ఒక సిద్దిపేట నియోజకవర్గంలోనే సుమారు రూ.300 కోట్ల విలువ గల వడ్లు పండుతున్నాయన్నారు. కేసీఆర్ అనే అద్భుత దీపం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. 24 గంటల కరెంట్, రైతుబంధు, కాళేశ్వరం నీళ్లు తెచ్చి, సకాలంలో ఎరువులు ఇవ్వడం, ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్లనే అధిక పంటలు పండుతున్నాయన్నారు. సిద్దిపేట జిల్లాలో ఈ యాసంగిలో రూ.1500 కోట్ల పంట కొనబోతున్నామని, తెలంగాణ రాష్ట్రంలో రూ.27 వేల కోట్ల వడ్లు ప్రతి ఏడాది పండుతున్నాయన్నారు. సీఎం కేసీఆర్ రైతు విలువ పెంచడం వల్లనే భూముల విలువలు పెరిగాయన్నారు.
బీజేపీ, కాంగ్రెస్ వాళ్ల మాయమాటలు నమ్మొద్దు..
సిద్దిపేట జిల్లా రిజర్వాయర్ల ఖిల్లాగా.. ఆలయాలకు నిలయంగా మారిందని మంత్రి అన్నారు. ఎన్నో ప్రాజెక్టులు కట్టి, దేవాలయాలు కట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు చెప్పే మాటలు నమ్మవద్దన్నా రు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం ఇచ్చిందా అని ప్రశ్నించారు. వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి.. డీజిల్ రెట్లు పెంచి పెట్టుబడిని రెట్టింపు చేశారని మండిపడ్డారు. తాను తెలంగాణ పథకాల గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఎగిరెగిరి పడుతున్నారన్నారు. తాను రాష్ట్రంలో జరిగే మంచి పనుల గురించి మాత్రమే చెప్పానని.. ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి మాట్లాడలేదన్నారు.
మీకు చాతనైతే ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు కోసం పోరాడాలని హితవు పలికారు. సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ మాట్లాడుతూ ఎనిమిదేండ్లలో తెలంగాణ రాష్ట్రం భారతదేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. పేదరిక నిర్మూలన కోసం, ప్రజల జీవన ప్రమాణాలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి సిద్దిపేట జిల్లా కన్వీనర్ వంగ నాగిరెడ్డి, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ సవితాప్రవీణ్‌రెడ్డి, జడ్పీటీసీ తుపాకుల ప్రవళ్లిక, టీఆర్ఎస్ అర్బన్ మండల శాఖ అధ్యక్షుడు ఎద్దు యాదగిరి, పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, మిట్టపల్లి మాజీ సర్పంచ్ పయ్యావుల రాములు, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తుపాకుల బాల్‌రంగం, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ నేతలు
తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేవు. రాష్ట్రంలో అభివృద్ధిని చూసి బీజేపీ నేతలు ఓర్వలేక నానాయాగీ చేస్తున్నారు. పేపర్ లీక్‌లు చేసి మనపైనే బదనాం పెడుతున్నారు. బండి సంజయ్ అరెస్ట్ తర్వాత పేపర్ లీకేజీలు ఆగిపోయాయి. సిద్దిపేట అర్బన్ మండలంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం బహిరంగ సభను తలపిస్తున్నది. ఆత్మీయ సమ్మేళనాల ద్వారా రాష్ట్రంలో ఎక్కడ చూసినా మంచి స్పందన వస్తుంది. సిద్దిపేటలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. మంత్రి హరీశ్‌రావు వైద్యారోగ్యశాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ దవాఖానలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. కంటి వెలుగు కార్యక్రమాన్ని ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. మంత్రి హరీశ్‌రావు మీకు ఎమ్మెల్యేగా ఉండడం సిద్దిపేట ప్రజల అదృష్టం.
– బోడెకుంటి వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా సమన్వయకర్త