మెదక్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో చక్రం తిప్పబోయేది కేసీఆరేనని, బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని మెదక్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మెదక్ గోల్ బంగ్లాలో బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ప్రతినిధుల సభను ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి బీఆర్ఎస్ జెండావిష్కరణ, తెలంగాణ తల్లికి నివాళులు, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ముందుగా 12 అంశాలపై సభలో తీర్మాణాలు ప్రవేశపెట్టారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ మీరే నా బలం, మీరే నా బలగం.. మీ ఆశీస్సులతో నేను ఎమ్మెల్యే అయ్యానని, మీ రుణాన్ని తీర్చుకుంటానన్నారు. గతంలో తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు తెలంగాణ ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించుకోవాలని, మననం చేసుకోవాలన్నారు. గత పాలించిన కాంగ్రెసోళ్లు, కేంద్రంలో బీజేపీ పాలిస్తున్నప్పుడు తెలంగాణ ఎలా ఉండే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి జరిగిందని తెలిపారు.
ఇక్కడి పథకాలు ఉన్నాయా..?
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతులకు 24గంటల ఉచిత కరెంటు ఇస్తున్నారా? రైతులకు రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నారా? పింఛన్లు, కల్యాణలక్ష్మి, తాగునీటి పథకాలు ఉన్నాయా? ఇవన్నీ ఇవ్వని బీజేపీ నాయకులు తెలంగాణలోకి వచ్చి మాట్లాడుతున్నారని అని బీజేపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్‌షా మీరు తెలంగాణ గురించి తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. బీజేపీ పార్టీ కుట్రలు, కుతంత్రాలతో తెలంగాణను నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడంతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం అంటే పెద్దన్న పాత్ర పోషించాలని అన్నారు. సీఎం కేసీఆర్ దళితులు ఆర్థిక స్వాలంబన కోసం దళితబంధు ప్రవేశపెడుతున్నారన్నారు. హైదరాబాద్‌లోని సచివాలయం పక్కనే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు.
కేంద్రంలో చక్రం తిప్పబోయేది కేసీఆరే…
దేశంలో బీఆర్ఎస్ కీలక భూమిక పోషించాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. అమిత్‌షా లాంటి వారు అతిథులని, మనం హక్కుదారులమని అన్నారు. తెలంగాణ ప్రజలు చిల్లర రాజకీయాలను ఆదరించరని, ప్రతిపక్షాల మాటలు కోటలు దాటుతున్నాయని, చేతలు మాత్రం గడప దాటడం లేదన్నారు. కుట్ర కొద్ది మా క్యాడర్‌ను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీ వాళ్లు ఒక్కమాట అంటే బీఆర్ఎస్ నేతలు పది మాటలు అంటారని గుర్తు చేశారు. ప్రజలకు వ్యతిరేక పరిపాలన బీజేపీ అందిస్తుందని, ప్రజాకర్షక పథకాలు సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్నారన్నారు.
రైతులు కష్టపడి పండించిన పంటలను తెలంగాణ సర్కారే కొనుగోలు చేస్తుందని, ఇతర రాష్ర్టాల్లో రైతులు పండించిన పంటలను కొంటున్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పంటలను కొనడంలో రైతులను ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి, మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్, జితేందర్‌గౌడ్, వైస్ చైర్మన్లు మల్లికార్జున్‌గౌడ్, పుట్టి విజయలక్ష్మి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జడ్పీటీసీలు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, పార్టీ మండలాల అధ్యక్షులు అంజాగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ…
మెదక్ నియోజకవర్గ ప్రతినిధుల సభ సందర్భంగా జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్‌ర్యాలీ నిర్వహించారు. మెదక్ పట్టణంలోని సాయిబాలాజీ గార్డెన్స్ నుంచి ఆటోనగర్, పాత బస్టాండ్, రాందాస్ చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా గోల్ బంగ్లా వరకు బైక్ ర్యాలీ కొనసాగింది. బీఆర్ఎస్ ప్రతినిధులు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డికి గజమాలలతో ఘనంగా సన్మానించారు.