మునిపల్లి, సెప్టెంబర్ 20: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో సర్కారు విద్య బలహీనమవుతున్నది. సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడంతో మండలంలోని పాఠశాలలు ఒక్కొక్కటిగా మూతబడుతున్నాయి. అధికారులు ఇష్టారీతిగా డిప్యుటేషన్లు వేస్తుండడంతో టీచర్ల కొరత వేధిస్తున్నది. దీంతో చాలా గ్రామాల్లో పిల్లలు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది.
ఇప్పటికే మండలంలో రెండు పాఠశాలలు మూతపడ్డాయి. మన్సాన్పల్లి ప్రాథమిక పాఠశాలలో గతేడాది 30మంది విద్యార్థులు,ఒక టీచర్ ఉండేవారు.ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయురాలు సెలవుపై విదేశాలకు వెళ్లింది.ఆమెకు సెలవు మంజూరు చేసిన అధికారులు అక్కడ మరో ఉపాధ్యాయుడిని పంపించక పోవడంతో ఆ పాఠశాలను మూసివేశారు. ఖమ్మంపల్లి ఉర్దూ మీడియం పాఠశాల ఉపాధ్యాయురాలు సెలవులో వెళ్లగా, మరో ఉపాధ్యాయుడిని నియమించకపోవడంతో ఆ పాఠశాల పిల్లలు మరో పాఠశాలకి వెళ్లడంతో ఖమ్మంపల్లి ఊర్దూ మీడియం పాఠశాల మూతపడింది.
ఇవేకాకుండా మండలంలోని మరికొన్ని పాఠశాలలు మూసివేసే పరిస్థితి ఉన్నాయి. గార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో మొత్తం ఏడుగురు ఉపాధ్యాయులు ఉండాలి. బదిలీలకు ముందు ఆరుగురు ఉపాధ్యాయులు గార్లపల్లి పాఠశాలల్లో విధులు నిర్వహించే వారు. బదిలీల్లో ఈ పాఠశాల నుంచి ఆరుగురు ఉపాధ్యాయులు ఇతర పాఠశాలలకు వెళ్లిపోయారు. వీరి స్థానంలో వేరే ఉపాధ్యాయులు రాకముందే ఇక్కడి టీచర్లను రిలీవ్ చేయడంతో ప్రస్తుతం ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే పాఠశాలకు వచ్చారు.
ఇక్కడికి కొత్తగా వచ్చిన ఆ ముగ్గురిలో నుంచి ఒక ఉపాధ్యాయుడిని వేరే మండలానికి డిప్యుటేషన్‌పై పంపారు. దీంతో ప్రస్తుతం గార్లపల్లి ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఏడు తరగతులకు ఒక్కరే ఉపాధ్యాయుడు బోధిస్తున్నారు. చీలపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారు. వారి స్థానంలో ఒక్కరే రావడంతో ప్రస్తుతం చీలపల్లి పాఠశాలలో ఏడు తరగతులకు ఒక్కరే పాఠాలు బోధిస్తున్నారు.
డిప్యుటేషన్లో అధికారుల ఇష్టారాజ్యం…
మూడేండ్లుగా మునిపల్లి మండలంలో ఉపాధ్యాయుల సర్దుబాటు విషయంలో అధికారులు నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తుండడంతో టీచర్లు లేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేటప్పుడు ఒక మండలానికి సంబంధించిన ఉపాధ్యాయులని అదే మండలంలో అవసరమైన చోట సర్దుబాటు చేయాలి. కానీ, మునిపల్లి మండలంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులను ఎంఈవో, డీఈవోతో కలిసి నిబంధనలకు విరుద్ధ్దంగా డిప్యుటేషన్ల పేరుతో జిల్లాలోని ఇతర మండలాలకు పంపించారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు.
గతేడాది మునిపల్లి మండలం నుంచి పది మందికి పైగా ఉపాధ్యాయులను ఇతర మండలాలకు డిఫ్యుటేషన్‌పై వెళ్లినట్లు సమాచారం. దీంతో మండలం లో సర్కారు పాఠశాలలు నిర్వీర్యం అవుతున్నాయి. ఇటీవల జరిగిన బదిలీల్లో ఆ బడుల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని కొన్ని ఉపాధ్యాయ పోస్టులను బ్లాక్ చేయడంతో బదిలీ ల్లో కొత్త ఉపాధ్యాయులు ఆ పాఠశాలలకు రాలేక పోయారు. దీంతో చీలపల్లి, గార్లపల్లి, ఖమ్మంపల్లి, అంతా రం, పోల్కంపల్లి, తాటిపల్లి, మునిపల్లి, పెద్దచెల్మడ, చిన్న చెల్మెడ, పెద్దగోపులారం, కంకోల్, మేళసంగం, లోనికాలన్లతో పాటు మరికొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు తగ్గాయి.
మునిపల్లి మండలంలో ఏడు ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఖమ్మంపల్లి ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులు లేక మూతబడింది. చీలపల్లి, పిల్లోడి, పోల్కంపల్లి పాఠశాలల్లో ఏడు తరగతులకు బదులు 5వ తరగతి వరకు మాత్రమే తరగతులు కొనసాగుతున్నాయి. ఈ పాఠశాలల్లో ఆరు, ఏడు తరగతులు కుదించారు. బుసారెడ్డిపల్లి, గార్లపల్లి, పెద్ద చెల్మెడ, బుధేరా పాఠశాలల్లో మాత్రమే 7వ తరగతి వరకు తరగతులు కొనసాగుతున్నాయి..
డీఈవో ఆదేశాల ప్రకారమే..
మునిపల్లి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో విధు లు నిర్వహించే ఉపాధ్యాయులు ఇతర మండలాలకు డిప్యుటేషన్‌పై వెళ్లిన విషయం వాస్తవమే. మండలం నుంచి నాకు తెలియకుండానే డీఈవో అనుమతితో డిప్యుటేషన్‌పై ఇతర మండలాలకు ఉపాధ్యాయులు వెళ్లిపోతున్నారు. పైఅధికారుల ఆదేశాలను మేము అమలు చేయాల్సిందే. సరిపడా టీచ ర్లు లేక విద్యార్థులకు సరైన చదువు అందించలేకపోతున్నాం. కలెక్టర్ మేడం స్పందించి మునిపల్లి మండలం నుంచి ఇతర మండలాలకు డిప్యుటేషన్లపై వెళ్లిన ఉపాధ్యాయులను తిరిగి మునిపల్లి మండలానికి పంపించేలా చర్యలు తీసుకోవాలి.
– దశరథ్, ఎంఈవో, మునిపల్లి