కొండాపూర్, మే 15: అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని, రైతులకు ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. గురువారం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని సీహెచ్ కోనాపూర్‌లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే పట్టించుకోకుండా ప్రభుత్వం అం దాల పోటీల్లో నిమగ్నమైందన్నారు. రైతుల సంక్షేమం కంటే సీఎం రేవంత్‌కు అందాల పోటీలు ముఖ్యమయ్యాయని విమర్శించారు. రైతులు ఇంత ఇబ్బందులు పడుతున్నా అధికారులు ఎందుకు పట్టించకోవడం లేదని విమర్శించారు.
ప్రభుత్వం ధాన్యం సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతులు నష్టపోయినట్లు తెలిపారు. కొండాపూర్ మండలం సీహెచ్ కోనాపూర్‌కు చెందిన రైతు పెద్దాపురం బాలకృష్ణ 3 ఎకరాల్లో మక్క సాగుచేసి నష్టపోయినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ వెంకటలక్ష్మి, ఏవో గణేశ్, ఏఈవో రవి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మ్యాకం విఠల్, నాయకులు పాండురంగం, నగేశ్, రాందాస్, సంగారెడ్డి, మోహన్‌గౌడ్, శేఖర్, నజీర్, బాలాగౌడ్, మాజీ సర్పంచ్ గోవర్ధన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు రాజు, పవన్‌కుమార్, గ్రామస్తులు జైరాములు, శాంతయ్య, మహేశ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
హత్నూర, మే 15: అకాల వర్షాలకు తడిసిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నా రు. గురువారం హత్నూర మండలం దౌల్తాబాద్, దౌలాపూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రోజులు గడుస్తున్నా ధాన్యాన్ని వెంటవెంటనే కొనుగోలు చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాయాల్సి వస్తుందన్నారు.
Sunitha Laxma Reddy
ఇటీవల కురుస్తున్న వర్షాలకు తడిసిముద్దవుతున్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాలన్నారు. కొనుగోలు చేసిన అనంతరం డబ్బులను సకాలంలో రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఆరుకాలం కష్టపడి పండించిన రైతులకు అకాల వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.