మెదక్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : వివిధ వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు సకాలంలో అందించి లబ్ధి చేకూరేలా ప్రత్యేక చొరవ చూపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆసరా పింఛన్లు, తెలంగాణకు హరితహారం, బీసీలు, మైనార్టీలకు ఆర్థ్ధికసాయం, నోటరీ భూముల క్రమబద్ధీకరణ, గొర్రెల పంపిణీ, గృహలక్ష్మి, కారుణ్య నియామకాలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. సెప్టెంబర్ 15లోగా జిల్లాలకు కేటాయించిన హరితలక్ష్యాన్ని పూర్తి చేయాలని తెలిపారు.
దశాబ్ది సంపద వనాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని తెలిపారు. ఆసరా,స్పౌజ్, పెన్షన్ దరఖాస్తులు పెండింగ్ లేకుండా తక్షణమే పరిశీలించి అర్హుల జాబితాను ఆమోదం కోసం పంపించాలని సీఎస్ సూచించారు. రెండో విడత గొర్రెల పంపిణీ వేగవంతం చేయాలన్నారు. బీసీ కుల వృత్తుల వారికి, మైనార్టీలకు రూ. లక్ష ఆర్థిక సాయానికి సంబంధించి నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా త్వరితగతిన పంపిణీ పూర్తి చేయాలన్నారు. గృహలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల వెరిఫికేషన్ పూర్తిచేసి అర్హుల జాబితాను అప్లోడ్ చేయాలని సీఎస్ సూచించారు. అనంతరం మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా అధికారులతో మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటిన హైదరాబాద్లో జరిగే స్వాతం త్య్ర భారత వజ్రోత్సవాల ముగింపు కార్యక్రమ నిర్వహణకు అధికారులు సిద్ధం కావాలన్నారు.
ఈ సంవత్సరం జిల్లా హరితహారం లక్ష్యం 4.4లక్షలు కాగా, ఇప్పటికే శత శాతం లక్ష్యం పూర్తయినట్లు తెలిపారు. రెండో విడత గొర్రెల యూనిట్ల పంపిణీకి సంబంధించి జిల్లాలో గొర్రెల యూనిట్ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. గృహలక్ష్మి పథకం కింద జిల్లాలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి దరఖాస్తుదారుల్లో అర్హులను గుర్తించి దరఖాస్తులను వెంటవెంటనే అప్లోడ్ చేయాలన్నారు. జీవో, 59 కింద వచ్చిన దరఖాస్తుదారుల నుంచి రెవెన్యూ వసూలు చేసి పట్టాలు ఇవ్వాలన్నారు. జీవో 58 ప్రకారం అర్హులను గుర్తించి ప్రజా ప్రతినిధుల సమక్షంలో పట్టాలు పంపిణీ చేయాలన్నారు. జీవో 84 ప్రకారం వ్యవసాయేతర భూములు 125 గజాలలోపు స్థలం ఉన్న వారికి స్టాంపు డ్యూటీ మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. 3000 గజాల వరకు స్టాంపు డ్యూటీ వసూలుచేసి క్రమబద్ధీకరించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశం ఆగస్టు ఒకటి నుంచి మూడు నెలల వరకు ఉంటుందన్నారు.
జిల్లాలో సంపద వనాల ఏర్పాటు కోసం గుర్తించిన ప్రాంతాల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు, ఆర్చులు చెరువులు ఉన్న ప్రాంతాల్లో పెద్దపెద్ద మొకలు నాటాలన్నారు. ఫల సాయం వచ్చే మొకల పెంపకంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. కారుణ్య నియామకాల కింద ఉత్తర్వులు పొందిన వారిని శాఖల వారీగా పోస్టింగు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ వీడి యో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్, డీఆర్ఓ పద్మశ్రీ , జెడ్పీ సీఈవో శైలేష్ ,డీఫ్వో రవిప్రసాద్, డీపీవో సాయిబాబా, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.