కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే బతుకులు ఆగమై గోసపడతామని, బీఆర్ఎస్తో ఇంటింటా సంక్షేమం సాధ్యమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం మనోహరాబాద్, తూప్రాన్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల బైక్‌ర్యాలీలో పాల్గొన్నారు. తూప్రాన్ పట్టణంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ, కవయిత్రి మొల్లమాంబ, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయంటే అది కేవలం సీఎం కేసీఆర్ చలవేనని పేర్కొన్నారు. రూ.వందల కోట్లతో అభివృద్ధి జరుగుతున్నా కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదన్నారు. అరవై ఏండ్లలో జరగని అభివృద్ధిని కేవలం తొమ్మిదేండ్లలోనే చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కండ్లు ఉండి చూడలేని కాంగ్రెసోళ్లకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజలు దగ్గర పడ్డాయన్నారు. సీఎం కేసీఆర్‌కే ఓటేస్తామని పద్మశాలీలు, మల్కాపూర్ గ్రామంలోని ముదిరాజ్ కులస్తులు ఏకగ్రీవంగా తీర్మానం చేసి, తీర్మాన పత్రాలను మంత్రికి అందజేశారు. ముదిరాజ్ కులస్తులు ఎన్నికల ఖర్చు నిమిత్తం రూ.11 వేల నగదును మంత్రికి అందజేశారు.
రామాయంపేట/తూప్రాన్/మనోహరాబాద్, సెప్టెంబర్ 27: కాంగ్రెసోళ్ల మాటలు నమ్మితే మోసపోయి గోసపడతామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం మనోహరాబాద్, తూప్రాన్ మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, పూర్తయిన పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. ఉదయం పది గంటలకు మనోహరాబాద్ చేరుకున్న మంత్రి హరీశ్‌రావు మండలకేంద్రంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో నినాదాలు చేస్తూ బైక్‌ర్యాలీతో తూప్రాన్ పట్టణానికి చేరుకున్నారు. తూప్రాన్ పట్టణంలో రూ.50 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని రావెళ్లిలో నిర్మించిన యా దవసంఘం భవనాన్ని ప్రారంభించారు. తదనంతరం తూప్రాన్ పట్టణంలో డివైడర్ మధ్యలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ, కవయిత్రి మొల్లమాంబ, కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని వినాయక్‌నగర్‌లో నిర్మా ణం పూర్తయిన సీసీ రోడ్లను ప్రారంభించి, తూప్రాన్ పెద్ద చెరువు కట్టపైకి చేరుకున్నారు. పెద్ద చెరువుకట్టను సందర్శించి బోట్లతోపాటు, పెద్ద చెరువు కట్ట సుందరీకరించి, పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు కృషిచేస్తానని, ప్రజల కోరిక మేరకు చెరువులో 2 బోట్లను అందజేస్తానని తెలిపారు. అనంతరం తూప్రాన్ పట్టణం లో ముదిరాజ్ కమ్యూనిటీ భవనానికి, పట్టణంలోని ఈద్గా ఆధునికీరణ, అంబేద్కర్ భవనం కమ్యూనిటీ హాల్, మాలజంగం ఎస్సీ కమ్యూనిటీ భవనాలకు శంకుస్థాపన చేశారు.
కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు 55 మంది లబ్ధిదారులకు రూ.5 కోట్ల 10 లక్షల చెక్కులను మహిళాసంఘాలకు అందజేశారు. గంగపుత్ర సంఘానికి రూ.10 లక్షల ప్రొసీడింగ్ పత్రాన్ని అందజేశారు. 58, 59 జీవో కింద అర్హులైన లబ్ధిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా చెరువులు, వాగులు దుంకుతున్నాయంటే అది కేవలం సీఎం కేసీఆర్ చలవేనని పేర్కొన్నారు. రూ. వందల కోట్లతో జరుగుతున్న అభివృద్ధి కాంగ్రెస్ నా యకులకు కనిపించడం లేదా అన్నారు. ఇటీవల తూప్రాన్ వచ్చిన టీపీసీసీ నాయకుడు షబ్బీర్‌అలీ గజ్వేల్ ప్రాంతం అభివృద్ధి లేదని అనడం హాస్యాస్పదంగా ఉందని, ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్లు నిజాలు తెలుసుకొని మాట్లాడాలని మంత్రి హితవు పలికారు. ఆరవై ఏండ్లలో జరగని అభివృద్ధి కేవలం తొమ్మిదేండ్లలోనే చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మిషన్ కాకతీయతో చెరువులు, కుంటలతో పాటు, మిషన్ భగీరథతో అక్కాచెల్లెళ్లకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చేసింది కేసీఆర్ కాదా అని కాంగ్రె స్, బీజేపీ నాయకులను ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెసోళ్లు కండ్లుతెరిచి అభివృద్ధిని చూడాలన్నారు. నాడు అంతా బీడుభూములే కనిపించేవని, నేడు ఎక్కడచూసినా నీటివనరులు కనిపిస్తున్నాయన్నారు. కండ్లుండి చూడలేని కాంగ్రెసోళ్లకు ప్రజలు గుణపాఠం చెప్పేరోజలు దగ్గరపడ్డాయని మంత్రి పేర్కొన్నారు.
తూప్రాన్ పట్టణంలోని దివంగత తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తూప్రాన్‌లో ఉన్న పద్మశాలీలు సీఎం కేసీఆర్‌కే ఓటేస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేసి, తీర్మాన పత్రాలను మంత్రికి అందజేశారు. కొండా లక్ష్మణ్ బాపూజీ అందరివాడని, మలి దశ తెలంగాణ ఉద్యమం కోసం జల దృశ్యంలోని తన స్వంత ఇంటిని తెలంగాణ భవనానికి విరాళంగా ఇచ్చారని గుర్తు చేశారు. తూప్రాన్ పట్టణంలోని పద్మశాలీ మహిళలు బోనాలతో సభా ప్రాంగణానికి చేరకొని మంత్రికి ఘనస్వాగతం పలికారు.
త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు గంపగుత్తగా ఓట్లు వేస్తామని తీర్మానంతో పాటు, ఎన్నికల ఖర్చుల నిమిత్తం రూ.11 వేల నగదును మల్కాపూర్ గ్రామంలోని ముదిరాజ్ కులస్తులు మంత్రి హరీశ్‌రావుకు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ‘గడ’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, ఆర్డీవో జైచంద్రారెడ్డి, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్‌గౌడ్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్, సర్పంచుల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్కుల మహిపాల్‌రెడ్డి, ఎంపీపీ స్వప్నావెంకటేశ్యాదవ్, జడ్పీటీసీ రాణీ సత్యనారాయణగౌడ్, శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ గొర్రె వెంకట్‌రెడ్డి, ఆత్మ కమిటీ డైరెక్టర్ రేణుకామహేందర్, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, వాహన కుమ్మరి సంఘం అధ్యక్షుడు దశరథ, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొట్టాల యాదగిరి, డీఎస్పీ యాదగిరిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు సతీశ్‌చారి, తూప్రాన్, మనోహరాబాద్ మండలాధ్యక్షులు పురం మహేశ్, బాబుల్ రెడ్డి, మత్స్యశాఖ మాజీ డైరెక్టర్ గడప దేవేందర్, మున్సిపల్ కమిషనర్ మోహన్, కౌన్సిలర్లు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.