దుబ్బాక, సెప్టెంబర్ 9 : తెలంగాణలో సంపద పెంచి, పేదలకు పంచడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు 60 ఏండ్ల పాలనలో కులవృత్తులను పూర్తిగా నిర్వీర్యం చేశాయన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ గ్రామీణ కుల వృత్తులకు ఆదరణ కల్పించేందుకు బీసీబంధు పథకాన్ని ప్రవేశపెట్టారని కొనియాడారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో బీసీబంధు, దళితబంధు పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. శనివారం దుబ్బాక బాలాజీ ఫంక్షన్ హాల్లో దుబ్బాక నియోజకవర్గ బీసీబంధు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మతో కలిసి మెదక్ ఎంపీ పాల్గొన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో తొలివిడతలో 287 బీసీబంధు లబ్ధిదారులు ఎంపిక చేశారు. దుబ్బాక మున్సిపాలిటీ, దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, అక్బర్పేట-భూంపల్లి మండలాలకు చెందిన 245 మంది లబ్ధిదారులకు జడ్పీ చైర్‌పర్సన్‌తో కలిసి ఎంపీ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సబ్బండవర్గాల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు. బీసీబంధు, ధళితబంధు పథకాలపై బీజేపీ, కాంగ్రెస్‌లు రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆ పార్టీలకు ప్రజాసంక్షేమంపై పట్టింపు లేదని, సీట్లు, పదవుల కోసమే చిల్లర రాజకీయాలు చేయడమే పనిగా పెట్టుకున్నాయంటూ మండిపడ్డారు. ఎవరెన్నీ రాజకీయాలు చేసినా, ఎన్ని ఇబ్బందులు సృష్టించినా తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ కొనసాగిస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు, ప్రతి గడపకూ సంక్షేమ పథకం అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
బీసీబంధు పథకంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేయడం సిగ్గుచేటని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆ పార్టీలకు బీసీ బంధు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో అర్హులైన బీసీలందరికీ దశలవారీగా బీసీబంధు అందజేస్తామన్నారు. బీసీబంధు పథకం ఆరంభం మాత్రమేనని, రాష్ట్రంలో బీసీబంధు, ధళితబంధు పథకాలు నిరంతర ప్రక్రియ అన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరికీ విడతల వారీగా ప్రభుత్వ అందజేస్తున్నదన్నారు.ఎన్నికల్లో మాయ మాటలు చెప్పే పార్టీలను నమ్మొద్దని, పనిచేసే పార్టీలను ఆదరించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని, మూడోసారి సీఎం కేసీఆర్ అని స్పష్టం చేశారు. దుబ్బాకలో బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ బీసీబంధుపై రాజకీయం చేస్తున్నారని, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బీసీబంధు కార్యక్రమంలో పాల్గొనకపోవడం విడ్డూరకరమన్నారు. మూడేండ్లలో ఎమ్మెల్యే రఘునందన్ పైసా అభివృద్ధి చేయలేదని, కేవలం తన వ్యక్తిగత ప్రచారం కోసం సోషల్ మీడియా, టీవీ చానళ్లలో ఊక దంపుడు ఉపన్యాసాలకు పరిమితమయ్యాడని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో బీజేపీ ప్రజావిశ్వసనీయత కోల్పోయిందన్నారు. కాంగ్రెస్‌కు క్యాడర్ లేదన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి, వైస్ చైర్పర్సన్ అదికం సుగుణ బాలకిషన్, ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ భాస్కరాచారి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఏఎంసీ, పీఏసీఎస్ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.