YOUTH Trailer | అసురన్, విడుదల-2 వంటి చిత్రాలతో తన నటనతో మెప్పించిన తమిళ యువ నటుడు కెన్ కరుణాస్ కథానాయకుడిగా పరిచయమవుతూ, స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రం ‘యూత్’. తమిళంలో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం, ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూస్తుంటే.. మనల్ని స్కూల్ మరియు కాలేజ్ రోజులకు తీసుకెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. ఇంటర్మీడియట్ చదివే ప్రవీణ్ (కెన్ కరుణాస్) అనే కుర్రాడు, చదువు కంటే ప్రేమకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటాడు. ఐఏఎస్ కావాలనే తల్లి కోరికకు, తన మనసులోని ప్రేమ భావాలకు మధ్య జరిగే సంఘర్షణను కామెడీ మరియు ఎమోషన్ కలగలిపి చూపించారు. ఒక అమ్మాయిని ప్రేమిస్తే, ముగ్గురు అమ్మాయిలు ప్రవీణ్ వెంట పడటం అనే ఆసక్తికరమైన ట్విస్ట్‌తో ట్రైలర్ సాగింది.
నేషనల్ అవార్డ్ గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం ఈ సినిమాకు పెద్ద ఎసెట్ అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని పార్వత ఎంటర్టైన్మెంట్స్ నిర్మించగా, తెలుగులో E2C టాకీస్ బ్యానర్‌పై హౌస్‌ఫుల్ వినీత్ మరియు సందీప్ విడుదల చేస్తున్నారు.కెన్ కరుణాస్ సరసన అనిష్మా అనిల్ కుమార్, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే సీనియర్ నటులు సూరజ్ వెంజరామూడు, దేవదర్శిని తల్లిదండ్రుల పాత్రల్లో కనిపించనున్నారు. తమిళంలో ఈ చిత్రం మార్చి 19న విడుదలవుతుండగా, తెలుగు వెర్షన్ మార్చి 26న థియేటర్లలోకి రానుంది. ‘ప్రేమలు’, ‘లిటిల్ హార్ట్స్’ వంటి సినిమాలను ఇష్టపడే యువతకు ఈ ‘యూత్’ సినిమా తప్పకుండా కనెక్ట్ అవుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.