హవేళీఘనపూర్, ఏప్రిల్ 29 : రైతుల పట్ల కేంద్రంలోని బీజేపీ నేతలకు కనీస అవగాహన లేదు. ఈ విషయాన్ని గమనించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ చొరవతోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం హవేళీఘనపూర్ మండలం ఫరీద్పూర్ గ్రామంలో శబరిమాత ఆలయ ఆవరణలో బీసీ కమ్యూనీటిహాల్ భవన నిర్మాణానికి భూమిపూజా చేశారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం మొండి వైఖరి వల్ల రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేని దయనీయ పరిస్థితి దాపురించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులు ఏ పంట పండించినా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉందని, రారైస్ పేరుతో తెలంగాణ రైతులు పండించిన వడ్లను కొనుగోలు చేయమని ఇబ్బందులకు గురి చేసే విధంగా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు.
సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి కావడం వల్లే ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, వైస్ ఎంపీపీ రాధాకిషన్యాదవ్, మెదక్ పీఎసీఎస్ చైర్మన్ హన్మంత్రెడ్డి, బ్రహ్మం, గ్రామ సర్పంచ్ సౌందర్య, ఎంపీటీసీ రాజయ్య, ఆత్మ కమిటీ చైర్మన్ అంజాగౌడ్, తదితరులు పాల్గొన్నారు.