రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సంబురంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో మంగళవారం విద్యా దినోత్సవం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పెద్దఎత్తున మొక్కలు నాటారు. ఆయా గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించారు. డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ప్రారంభించారు. విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్‌లు, నోట్‌బుక్స్ అందజేశారు. రాగి జావ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దుబ్బాక మండలం ఆకారంలో మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, గజ్వేల్ మండలం అక్కారంలో ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ విద్యాదినోత్సవంలో పాల్గొన్నారు.
దుబ్బాక, జూన్ 20 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతమయ్యాయని, తెలంగాణలో అమలవుతున్న విద్యావిధానం దేశానికి ఆదర్శంగా నిలిచిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం దుబ్బాక నియోజకవర్గంలో విద్యాదినోత్సవం ఘనంగా నిర్వహించారు. దుబ్బాక మండలం ఆకారం గ్రామంలో ‘మనఊరు-మనబడి’ ద్వారా రూ.25లక్షలతో నిర్మించిన పాఠశాల భవనాన్ని ఎంపీ ప్రారంభించారు. పాఠశాలలో డిజిటల్ తరగతి గదులు, ప్రయోగశాల, కిచెన్‌షెడ్లను ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డితోపాటు ప్రజాప్రతినిధులు మొక్కలు నాటారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ గత సమైక్యాంధ్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో గ్రామీణ పేదవిద్యార్థులు ఉన్నత విద్యకు నోచుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
నాడు శిథిలావస్థకు చేరిన బడులు, నామమాత్రంగా ఉపాధ్యాయులు ఎన్నో రకల ఇబ్బందులతో విద్య కొనసాగేదని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన విద్యావసతులు లేకపోవడంతో పట్టణాలకు, ప్రైవేటు పాఠశాలకు తరలివెళ్లే దుస్థితి ఉండేదన్నారు. మరీ నేడు సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో సకల వసతులతో కూడిన పాఠశాల భవనాలు, విద్యార్థులకు గుణాత్మక విద్యనందిస్తున్నట్లు తెలిపారు. ‘మనఊరు-మనబడి’తో సర్కారు బడులు కార్పొరెట్ పాఠశాలలకు దీటుగా మారాయని తెలిపారు. గ్రామంలో ఉన్నా సర్కా రు బడుల్లో తమ పిల్లలను చదివించాలని ఆయన కోరారు. ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా తెలంగాణలో సర్కారు బడుల్లో విద్యార్థులకు సన్న బియ్యంతో కూడిన పౌష్టకాహారం అందిస్తున్నట్లు తెలిపారు. పేద విద్యార్థులకు విదేశీ ఉన్నత విద్యావకాశం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. పాఠశాలలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను ఎంపీ సన్మానించారు. కార్యక్రమంలో దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలతాకిషన్రెడ్డి, ఏఎంసీ చైర్పర్సన్ చింతల జ్యోతీకృష్ణ, సర్పంచులు నాగభూషణం, లక్ష్మి, బాలమణి, ఎంపీటీసీ పోలబోయిన లక్ష్మీనారాగౌడ్, ఎంఈవో ప్రభుదాస్, ఎంపీడీవో భాస్కరాశర్మ, బీఆర్ఎస్ నాయకులు బనాల శ్రీనివాస్, బాల్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.