సిద్దిపేట, సెప్టెంబర్ 3: కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న కుట్ర రాజకీయాల్లో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టును సీబీఐకి అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు దేవీప్రసాద్,పల్లె రవికుమార్, బాలరాజు యాదవ్ లు స్పష్టం చేశారు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కాదని 20 రిజర్వాయర్ల సమూహం అన్నారు.
మేడిగడ్డ బ్యారేజ్‌లో రెండు పిల్లర్లు కుంగిపోయిన అంశాన్ని రాజకీయం చేస్తూ కేసీఆర్, హరీశ్‌రావు ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్,బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయన్నారు. కేసీఆర్ సాధారణ రాజకీయ నాయకుడు కాదని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత అని గుర్తుచేశారు. తెలంగాణ రైతుల కరువు కాటకాలను శాశ్వతంగా దూరం చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకొని గోదావరినదిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారని గుర్తుచేశారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుని కేవలం రూ.94 వేల కోట్లతో పూర్తి చేశారని చెప్పారు.గోదావరినదికి 560 మీటర్ల ఎత్తులో ఉన్న సిద్దిపేట ప్రాంతానికి ఈ ప్రాజెక్టులో చిట్టచివరి ప్రాంతమైన కొండపోచమ్మసాగర్‌కు నీళ్లని ఎత్తిపోసి లక్షలాది ఎకరాల ఆయకట్టుకు నీళ్లు అందించిన చరిత్ర కాళేశ్వరం ప్రాజెక్టుదన్నారు.ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేసీఆర్ రూపకల్పన చేయగా అప్పటి ఇరిగేషన్‌శాఖ మంత్రి హరీశ్ రావు కీలకపాత్ర పోషించారన్నారు.
ప్రాజెక్టుపై కనీస అవగాహన లేని కాంగ్రెస్ మంత్రులు అసెంబ్లీలో అవాకులు చవాకులు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మంత్రులు వేసిన ప్రశ్నలకు హరీశ్‌రావు ఒకడే సమాధానాలు చెప్పాడని గుర్తుచేశారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా ఘోష్ కమిషన్ వేసి నరేంద్ర మోదీతో కుమ్మకై కాళేశ్వరంపై విచారణ నిమిత్తం సీబీఐకి అప్పగిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించారన్నారు.
సీబీఐ, ఈడీ బీజేపీ జేబు సంస్థలని ఒక వైపు కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ విమర్శలు చేస్తుండగా మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అదే సీబీఐని రాష్ట్రానికి ఆహ్వానించి విచారణ చేయమని చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చిన గోదావరి జలాలతో తెలంగాణలో లక్షలాది ఎకరాల్లో పంటలు పండించిన రైతులకు వాస్తవాలు ఏమిటో తెలుసన్నారు.