సంగారెడ్డి, సెప్టెంబర్ 2: తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ నాయకులు కూల్చేందుకు కుట్రలు చేస్తూ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని కేసును సీబీఐకి అప్పగించడం కుట్రలో భాగమేనని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మంగళవారం పార్టీ అధిష్టానం పిలుపు మేరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొత్త బస్టాండ్ వద్ద ఫ్లకార్డులతో ధర్నా, రాస్తారోకో, నిరసన చేపట్టారు. ఇదేమి రాజ్యం..ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రా జ్యం అంటూ నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ అబద్ధపు ప్రచారాన్ని ప్రజలకు తెలియజేసేందుకే నిరసన కార్యక్రమం నిర్వహించామన్నారు. రేవంత్‌రెడ్డి పాలన నిజాం పాలనను తలపిస్తుందన్నారు. ప్రాజెక్టుపై పైశాచిక ఆనందం పొందడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. కేసీఆర్ దృష్టి మళ్లించేందుకు కుట్ర చేస్తుందని, తెలంగాణపై కేసీఆర్ దృష్టి మళ్లించడం రేవంత్‌రెడ్డి తరం కాదని చురకలంటించారు. కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతులు చేస్తే కేసీఆర్‌కు పేరు వస్తుందని, తెలంగాణ సస్యశామలం అవుతుందని బాగుచేయడంలేదన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకోవడానికి కాళేశ్వరం మూత పడాలని, నీళ్లు బనకచర్లకు వెళ్లాలని రేవంత్ కుట్ర చేస్తున్నారన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్దదని, ప్రాజెక్టు పిల్లర్లు కూలుతున్నాయని అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధిపొంది ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కారని కాంగ్రెస్‌పై ఎమ్మెల్యే నిప్పులు చెరిగారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడంలేదని ప్రశ్నించారు. చంద్రబాబుకు గురుదక్షిణగా బనకచర్లతో ఆంధ్రాకు నీటి తరలింపునకు అనుమతి ఇచ్చారని, రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు లోపాయికారి ఒప్పందం చేసుకుని కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఉండటంతో ఇద్దరిని కాపాడేందుకు కేంద్రానికి బాబు తో రాయబారం నడిపిస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారన్నారు.
కాళేశ్వరంను ఖతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు అవస్థలు పడుతున్నారని ఎద్దేవాచేశారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని, అందుకే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు వెనుకంజ వేస్తున్నారన్నారు. ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం మానుకుని పాలనపై దృష్టిపెట్టాలని రేవంత్‌రెడ్డికి హితవుపలికారు. డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం, సీడీసీ మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, కంది మాజీ జడ్పీటీసీ కొండల్‌రెడ్డి, సీనియర్ నాయకు లు హకీమ్, డాక్టర్ శ్రీహరి, వరలక్ష్మి, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆర్. వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి నర్సింహులు, మల్లన్న, నియోజకవర్గంలోని మండలాల అధ్యక్ష, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.