రామాయంపేట రూరల్, జూన్ 29: ఒకప్పుడు ఏ గ్రామంలో చూసిన గొర్రెలు, మేకలు, బర్రెలు, కాడెడ్లు ఇలా గ్రామాల్లో దర్శనమిచ్చేవి. అలాగే కుల వృత్తులను నమ్ముకున్న వారు ఎందరో వలసలు వెళ్లాల్సిన దుస్థితి ఉండేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పరిస్థితి దారుణంగా ఉండేది. కానీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత మంచి రోజులు వచ్చాయి. గ్రామాల్లో వలసలు లేకుండా చేయడం, వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహించడం కోసం అప్పటి కేసీఆర్ సర్కారు కుల వృత్తులను ప్రోత్సహించడంతో పాటు మూగజీవాల పెరుగుదల కోసం ఎంతో కృషి చేసింది. అర్హులైన గొర్రెల కాపరులకు గొర్రెలు, మేకలు ఒక్కొక్కరికి 25 చొప్పున అందించింది. దీంతో గొర్రెల కాపరులు తమకు ఉన్న జీవాలతో పాటు వీటిని పెంచుతూ దర్జాగా జీవించారు. ఎంతో మంది వలసలు వెళ్లాల్సి వచ్చిన వారు సైతం అప్పటి సర్కారు నిర్ణయంతో తమ ఆలోచన విధానం మార్చుకున్నారు.
అలాగే గ్రామాల్లో పశువులకు సీజనల్ వ్యాధుల నివారణకు టీకాలు వేయించడం, పశువైద్య శిభిరాలు ఏర్పాటు చేసి కృత్తిమ గర్బాదారణ టీకాలు వేయడంతో పాటు అటవీ జంతువుల సంరక్షణ కోసం అంబులెన్స్ సౌకర్యం సైతం కల్పించారు. అలాగే కుల వృత్తులను నమ్ముకొని జీవించే వారు వలసలు వెళ్లకుండా నాయి బ్రాహ్మణులకు ఉచితంగా 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ అందించింది. మత్స్యకారులకు సబ్సీడీలపై టీవీఎస్ ఎక్సెల్లు, టాటా ఏస్ వాహనాలు, చేపలు అందించడం జరిగింది. స్వచ్ఛమైన కల్లు అందించాలనే ఉద్దేశంతో గౌడ కులస్థులకు ఈత వనాలు ఏర్పాటు చేయించింది. ఇలా సవ్యంగా సాగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పరిస్థితి తలకిందులైంది. పశువైద్య శాఖను పట్టించుకున్న పాపాన పోవడం లేదు. పశువైద్యం కోసం మందులు కూడా అందుబాటులో ఉండటం లేదు. నెలల తరబడి మూగ జీవాల చికిత్సల కోసం ఎదురు చూసిన రైతులు వాటి పోషణ తగ్గించారు. గొర్రెల, మేకల కాపర్లు సైతం ఉన్న జీవాలకు రోగం వస్తే వైద్యం అందుబాటులో లేకపోవడంతో వాటిని అమ్ముకుంటున్నారు. పశువులకు పశుగ్రాసం దొరక్కపోవడం, పశుగ్రాస విత్తనాలు ప్రభుత్వం అందించకపోవడంతో గ్రామాల్లో పశువుల సంఖ్య గణనీయంగా తగ్గింది. కుల వృత్తులను అసలే పట్టించుకోవడం లేదు. గతంలో ఎంతో ఆనందంగా ఉన్న తాము ప్రస్తుతం ఇలా కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో ఊర్లకు వచ్చి మందులు ఇచ్చెటోళ్లు..
గతంలో వెటర్నరీ అధికారులు గ్రామానికి వచ్చి రోగాల బారిన పడ్డ జీవాలకు మందులు ఇచ్చేవాళ్లని దామరచెర్వుకు చెందిన గొర్రెల కాపరి బీరయ్య అన్నారు. ఒక వేళ రాకపోయినా తామే రామాయంపేట ఆస్పత్రికి వెళ్లి చికిత్సలు చేయించేవాళ్లం. కానీ ఇప్పుడు గ్రామానికి రావడం కాదుకదా ఆస్పత్రికి వెళ్లినా ఎవరూ ఉండకపోవడంతో పాటు మందులు కూడా దొరకడం లేదు. దీంతో జీవాల సంఖ్య తగ్గుతుంది. ఇలా అయితే గ్రామాల్లో జీవాలు దొరకడం కష్టంగా మారడం ఖాయమన్నారు.
పూర్తి స్థాయిలో ఉచిత చేపలు ఇవ్వడం లేదు..
గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఉచిత చేప పిల్లలను అందించిందని ముదిరాజ్ మత్య్సకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్ అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం అలా కాకుండా కేవలం కొన్ని చెరువులకు మాత్రమే 50 శాతం ఇస్తుందని చెప్పారు. దీంతో మత్స్యకారులకు అన్యాయం జరుగుతుంది. లేకుంటే చేప పిల్లల స్థానంలో సొసైటీలకు నేరుగా డబ్బులు ఇవ్వాలి.దీంతో మత్స్యకారులు నాణ్యమైన చేప పిల్లలు తెచ్చుకొని ఆదాయ మార్గాలు పెంచుకుంటారని తెలిపారు.
పశువులకు గడ్డి దొరకడం లేదు..
వరి కోత మిషన్ల ద్వారా వరి కోతలు కోయడంతో పశువులకు గడ్డి దొరకడం లేదని నారాయణ అనే రైతు చెప్పారు. గతంలో ప్రభుత్వం పశుగ్రామ విత్తనాలు అందించేది. దీంతో వ్యవసాయ బావుల వద్ద గడ్డిని పెంచి పశువులకు వేసేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థిత లేదు. పశుగ్రామ విత్తనాలు కూడా అందుబాటులో ఉండటం లేదు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.