హుస్నాబాద్, డిసెంబర్ 1: గ్రామాల్లో సర్పంచ్ పదవికి ఎన్నడూ లేని డిమాండ్ పెరుగుతోంది. సర్పంచ్ పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు అనేక ఆఫర్లు చేస్తున్నారు. ఆఫర్లు, ఒప్పందాలు, ఒట్లు, బాండ్లు తదితర అంశాలు ప్రస్తుతం ట్రెండ్‌గా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి గ్రామాల్లో బుజ్జగింపుల పర్వం మొదలైందని చెప్పొచ్చు. ఎన్నికల్లో నిలబడటం, ఓటర్లను ఓటు అభ్యర్థించడం, డబ్బులు పంచడం లాంటి లాంగ్ ప్రాసెస్‌కు స్వస్తి చెప్పి ఏకంగా ‘ఏకగ్రీవం’ అయితే ఎలాంటి లొల్లి ఉండదనే అభిప్రాయానికి వస్తున్నారు. దీంతో గ్రామాల్లో సర్పంచ్ పదవికి ఆఫర్లే ఆఫర్లు వస్తున్నాయి.
మొదటి విడత నామినేషన్ల పర్వం ముగియగా ప్రస్తుతం రెండో విడత నామినేషన్లు కొనసాగుతున్నాయి. మూడో విడత ఈ నెల 3వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. మొదటి విడతలో కొన్ని సర్పంచ్ స్థానాలను ఇప్పటికే ఏకగ్రీవం చేసుకున్నారు. ఇందులో ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే సర్పంచ్ పదవి వరించినట్లు సమాచారం. ఇదే కాకుండా జీపీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి గ్రామాల్లో ఎవరు సర్పంచ్ అవుతారు…ఎవరు వార్డు మెంబర్ అయితే బాగుంటుంది…ఆ కులం వాడా…ఈ కులం వాడా… ఆ పార్టీ నాయకుడా.. ఈ పార్టీ నాయకుడా.. ఎవడు నిల్చుంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతాడు…ఎవడు గెలిస్తే పనులు చేస్తాడు…అనే చర్చోపచర్చలు, మంతనాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో గ్రామాల్లో స్థానిక రాజకీయం వేడెక్కింది.
తనను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా చేస్తే ఇన్ని డబ్బులు ఇస్తాను… లేకుంటే గ్రామంలో నాకు ఇంత భూమి ఉంది. ఇందులో కొంత భూమిని గ్రామ పంచాయతీకి రాసిస్తాను… ఎదుటి వ్యక్తి ఎంత ఇస్తే నేను అంతకు రెట్టింపు ఇస్తా… కావాలంటే డబ్బులు, భూమి రెండు ఇస్తా…మీరు చెప్పినట్లు చేస్తా అంటూ ఆశావహులు గ్రామస్తులకు ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు గ్రామంలోని పెద్దలు, ప్రముఖులను ఒకచోటికి చేర్చి నిత్యం మంతనాలు జరుపుతున్నారు. ఎట్టకేలకు సర్పంచ్ పదవి పొందాలనుకునే వారు సాధ్యమైనన్ని దారులను వెతుకుతూ తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. సర్పంచ్ పదవి గ్రామ పరిధిని బట్టి రూ.5లక్షల నుంచి మొదలుకొని రూ.50లక్షల వరకు పలుకుతున్నట్లు సమాచారం.
సర్పంచ్ పదవి ఇస్తే గ్రామానికి ఏం చేస్తామో ముందే చెప్పి అవసరమైతే ఊరి దేవుళ్ల మీద ఒట్టు పెడతామని కూడా కొందరు ఆశావహులు చెప్తుండటం విశేషం. గ్రామ దేవతలపై ఒట్టుపెట్టి చెప్తున్నా…గ్రామాభివృద్ధికి కృషి చేస్తా… అంటూ కూడా ప్రమాణాలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. సర్పంచ్ అయితే ఏయే పనులు చేస్తానో రూ.100 బాండ్ పేపర్ రాసిస్తానని మరికొందరు హామీలు ఇస్తున్నట్లు సమాచారం. నామినేషన్ల పర్వం ముగిసే లోపు ఎట్టకేలకు ఏకగ్రీవంగా సర్పంచ్ పదవిని దక్కించుకోవాలనే ఆకాంక్షతో పలువురు నాయకులు అనేక వాగ్దానాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల బహిరంగంగా సర్పంచ్ పదవికి వేలం పాటలు నిర్వహించడం గమనార్హం.
గ్రామ స్థాయి నుంచి అసెంబ్లీ వరకు రాజకీయాలు మొత్తం కమర్షియల్‌గా మారాయనేది కొందరు రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. సేవా భావంతో చేసే రాజకీయాలు డబ్బుకు ముడిపడటంతో అవి కాస్తా కమర్షియల్‌గా మారాయని చెప్పొచ్చు. నిస్వార్థంగా ప్రజలకు సేవలందించాలనే లక్ష్యంతో ముందుకు వచ్చే నాయకులకు ప్రస్తుత పరిస్థితుల్లో స్థానం లేదనే చెప్పాలి. డబ్బు, హోదా ఉన్న వారే రాజకీయాల్లో రాణిస్తున్నారనేది సర్వసాధాణమైంది. ప్రజాఅవసరాలు, గ్రామ అవసరాలకు అనుగుణంగా ఏం చేయాలనే ఆలోచన చేసే వారు కరువయ్యారు. ఎన్నికలు వస్తే ఎన్ని లక్షలు ఖర్చు పెట్టాలి… వాటిని మళ్లీ ఎలా రికవరీ చేసుకోవాలన్నదే లక్ష్యంగా మారింది. ఇలాంటి పరిస్థితి మారి సేవాభావంతో పనిచేసే నాయకులను ప్రజలు ఎన్నుకున్నప్పుడే ప్రజాస్వామ్యం విజయం సాధిస్తుందని, ప్రజలు ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారనేది రాజకీయ మేధావుల అభిప్రాయం. ఆ దిశగా ప్రజలు ఆలోచిస్తారని ఆశిద్దాం.
గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చాయంటే గ్రామాల్లో కుల రాజకీయాలు అధికమవుతాయి. గ్రూపులుగా ఏర్పడి మనవాడే సర్పంచ్ కావాలంటే మనవాడే కావాలంటూ పట్టుదలకు పోతుంటారు. ప్రస్తుతం గ్రామాల్లో ఇదే జరుగుతోంది. గ్రూపులుగా ఏర్పడి ఎదుటి గ్రూపు వాళ్లు ఏం చేస్తున్నారని గమనిస్తున్నారు. జనరల్ స్థానాల్లో మన కులం వాడే ఈసారి సర్పంచ్ కావాలని కొన్ని కులాల వారు సమావేశాలు పెట్టుకుంటున్నారు. మరికొన్ని చోట్ల నామినేషన్లు వేయకుండా బెదిరింపులకు కూడా దిగుతున్నట్లు సమాచారం. గ్రామాల్లో ఎవరూ నామినేషన్ వేయకుండా ఎదుటి వారిపై అనేక ఒత్తిడిలు తెచ్చేందుకు కుట్రలు కూడా జరుగుతున్నట్లు తెలిసింది.