పటాన్చెరు, డిసెంబర్ 8: ఇంటి అరుగుపై కూర్చుని భో జనం చేస్తున్న మహిళపై కారు దూసుకొచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మహిళ మృతి చెందిన ఘటన పటాన్చెరు పోలీస్స్టేషన్ పరిధిలోని రుద్రారం గ్రామంలో గురు వారం జరిగింది.
ఎస్సై ప్రసాదరావు కథనం ప్రకారం.. రుద్రారం గ్రామానికి చెందిన కురుమ రాములమ్మ (48) తన ఇంటి అరుగుపై కూర్చొని భోజనం చేస్తున్నది. అదే సమయంలో గ్రామ పంచాయతీ వైపు నుంచి జాతీయ రహదారిపైకి వెళ్తున్న కారు వేగంగా దూసుకొచ్చి రాములమ్మను ఢీకొని, ముందుకెళ్లి చెట్టుకు ఢీకొన్నది.
రాములమ్మ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. కారు డ్రైవర్ పుర్ర పాండు అజాగ్రత్తగా, అతివేగంగా నడపడంతోనే ప్రమాదం జరిగిందని కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపారు. మృతురాలి భర్త కురుమ ఆంజనేయులు ఫిర్యాదు మేరకు పటాన్చెరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.