చిన్నశంకరంపేట, జూన్ 9: రెండు తలలతో దూడ జన్మించి మృతిచెందిన ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం రుద్రారంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు నర్సింహులు ఆవు ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పురిటి నొప్పులతో బాధపడుతూ అవస్తలు పడింది. వెంటనే ఈ విషయాన్ని మండల పశువైద్య సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బంది నవీన్, గోపాలమిత్ర మహేశ్ ఆవుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండు గంటలకు పైగా శ్రమించి దూడను అతికష్టం మీద బయటకు తీశారు. దూడ బయటికి రాగానే రెండు తలలు ఉండటాన్ని గమనించారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దఎత్తున దూడను చూడటానికి తరలివచ్చారు. దూడ బయటకు రాగానే మృతి చెందిందని వైద్య సిబ్బంది తెలిపారు. జన్యులోపం వల్లనే రెండు తలలతో దూడ జన్మించిందని, ఆవు కూడా మృతిచెందిందని వారు తెలిపారు.