సంగారెడ్డి కలెక్టరేట్, అక్టోబర్ 29: విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నాయకులు మాట్లాడుతూ పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కొన్నేండ్లుగా పెండింగ్లో ఉన్న విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాలు విడుదల కాలేదన్నారు. చదువులు కొనసాగించడంలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జారీచేసిన ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి నియామక పత్రాలు ఇస్తూ సీఎం రేవంత్ ఫొటోలకు పరిమితమయ్యాడని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు పెద్దగొల్ల శ్రీహరి, రాజేందర్, మన్సూర్ ఆహ్మద్, నాగరాజు, అఖిల్, రాకేశ్, రోషన్, పాండు పాల్గొన్నారు.