పంట రుణాలు మాఫీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో జిల్లావ్యాప్తంగా సంబురాలు అంబురాన్నంటాయి. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు బీఆర్ఎస్, జిల్లా రైతాంగం ఆధ్వర్యంలో గురువారం పెద్దఎత్తున సంబురాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. జిల్లాలోని ఊరూరా నిర్వహించిన సంబురాల్లో ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తొమ్మిదేండ్ల పాలనలో రైతుల కోసం ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసింది. ఇప్పటికే రూ.50వేల వరకు పంట రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం మిగతా పంట రుణాలను మాఫీ చేసేందుకు సీఎం కేసీఆర్ బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా గురువారం నుంచి రుణమాఫీ ్రప్రారంభమైంది. రుణమాఫీ ప్రక్రియను విడుతల వారీగా సెప్టెంబర్ రెండోవారంలోగా పూర్తి చేయనున్నారు. సీఎం కేసీఆర్ రైతుల ఆత్మబంధువంటూ రైతన్నలు పొగడ్తలతో ముంచెత్తారు. వ్యవసాయ రంగానికి గొప్ప ఊతమంటూ ప్రశంసించారు.
-సిద్దిపేట జిల్లా నెట్వర్క్, ఆగస్టు 3
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న దేవుడు సీఎం కేసీఆర్ సార్. అప్పుడు ఇచ్చిన మాటకు కట్టుబడి లచ్చ రూపాయల పంటరుణం మాఫీ జేసిండు. రైతుల కోసం తపన పడే నాయకున్ని నా జీవితంలో గిప్పటిదాక ఎన్నడూ సూడలె.. తెలంగాణ అచ్చినంకనే రైతులకు చెప్పనియన్నీ సీఎం కేసీఆర్ సారు ఇత్తుండు. బక్క పేద రైతుల కోసం ఎన్నో సేత్తున్న సీఎం కేసీఆర్ సార్‌ను రైతులు కడుపులో పెట్టుకొని సుత్తరు.
– జోగ్గారి బాల్‌నర్సయ్య,రైతు, లింగుపల్లి, మిరుదొడ్డి మండలం
రైతు పంట రుణమాఫీ అమలు సంపూర్ణం చేసే దిశగా తెలంగాణ సర్కారు చర్యలు మొదలు పెట్టింది. 2018 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కో రైతు కుటుంబానికి రూ.లక్ష వరకు పంట రుణమాఫీ జరుగనున్నది. అర్హులైన రైతులందరికీ విడుతల వారీగా రుణమాఫీ డబ్బును ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 45 రోజుల్లో ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.37వేల వరకు రుణాలు తీసుకున్న వారికి రుణ మాఫీ వర్తింపు చేశారు. లక్ష రూపాయల వరకు రుణం తీసుకున్న మిగిలిన వారికి ప్రయోజనం చేకూరనున్నది. ఇప్పటికే సంబంధిత రైతుల వివరాలన్నీ ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతు పక్షపాతి సీఎం కేసీఆర్‌తోనే ఇలాంటివన్నీ సాధ్యమని ప్రశంసిస్తున్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా రైతులతో కలిసి బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు నిర్వహించారు.
-సిద్దిపేట జిల్లా నెట్ వర్క్, ఆగస్టు 3
హుస్నాబాద్ : మేం ఎవుసం చేసుకునేందుకు బ్యాంకుల్లో తీసుకున్న అప్పులను మాఫీ చేసిన సీఎం కేసీఆర్ మా రైతులందరికీ దేవుడు. నేను బ్యాంకులో రూ.60 వేల అప్పు తీసుకున్న ఇప్పు డు అది మొత్తం సర్కారు వాళ్లే కడతరట. నాకు ఎంతో సంబురంగా ఉన్నది. బ్యాంకు అప్పు ఎట్ల తీర్చాలే అని చాలా బాధపడ్డాం. కేసీఆర్ సారు అప్పు మొత్తం మాఫీ జేసీ ఆదుకుంటున్నడు. రైతులు చనిపోతే కుటుంబానికి ఐదు లక్షల రూపాయలిస్తండు. ఇప్పుడు అప్పు లు తేర్పిండు. ఇంకా మాకు ఏం కావాలె. అందుకే మేమందరం కేసీఆర్‌తోనే ఉంటాం. ఆయనకు ఎల్లప్పుడు రుణపడి ఉంటాం. కేసీఆర్ సారు పది కాలాల పాటు సల్లగుండాలె.
-భూక్య బాసూ, చౌడుతండా రైతు , అక్కన్నపేట మండలం
తెలంగాణల సీఎం కేసీఆర్ సార్ ఉన్నన్ని రోజులు రైతులకు రంది అనేదే లేదు. కేసీఆర్‌కు రైతులు పడేటువంటి కష్టాలన్నీ తెలుసు. అందు కనే ఎలక్షన్ల కంటే ముందుగా చెప్పినట్లు బ్యాం కు రుణాలను మాఫీ చేస్తుండు. బ్యాంకు లోన్ మాఫీ అయితే రైతులకు ఎంతో లాభమైతది. ఇన్ని రోజుల సంది రైతులంతా లోన్మాఫీ కోసమే ఎదురు చూసిండ్రు. ఇప్పుడు లక్షలోపు లోన్ మాఫీ చేస్తమని సీఎం కేసీఆర్ చెప్పిండు. చాలా సంతోషంగా ఉంది. రైతులకు ఇంతమంచిగా సౌలత్లు చేస్తున్న కేసీఆర్ సార్‌కు రైతులమంతా రుణపడి ఉంటాం.
-బెడద బాలయ్య, రైతు, లద్నూర్, మద్దూరు మండలం
గజ్వేల్, ఆగస్టు 3 : రాష్ట్రంలో పంట రుణమాఫీ చేసి సీఎం కేసీఆర్ రైతులకు అండగా నిలిచారు. దేశం మొత్తం తెలంగాణ అభివృద్ధి వైపు చూస్తున్నది. రుణమాఫీ ప్రకటించినందుకు రైతు లు ప్రభుత్వానికి రుణపడి ఉంటారు. నేడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు సంతో షం వ్యక్తం చేస్తూ సంబురాలు జరుపుకొంటున్నారు. తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టి రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ధృడసంకల్పంతో పనిచేస్తున్నది. రైతులు ఇబ్బందిపడకూడదనే ఉద్దేశంతో రుణమాఫీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు రైతులు, పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు.
-బెండు మధు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, గజ్వేల్
గజ్వేల్ : సీఎం కేసీఆర్ పంట రైతుల రుణమాఫీపై తీసుకున్న నిర్ణయంతో రైతుల ముఖాల్లో సంతోషం వ్యక్తమవుతున్నది. మొదటి నుంచి కేసీఆర్ రైతుల మేలు కోసం కృషి చేస్తూనే ప్రాజెక్టుల నిర్మాణం చేసి సాగుకు నీరందించిన ఘనత ఆయనకే దక్కుతుంది. గత ప్రభుత్వాల హయాంలో పండిన ధాన్యంతో పోల్చితే నేడు తెలంగాణలో అత్యధికంగా ధాన్యం పండుతున్నది. దీని వెనకాల కేసీఆర్ కృషి, పట్టుదల ఎంతో ఉన్నది. కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు అన్ని వర్గాలకూ నచ్చే విధంగా ఉంటున్నాయి.
-ఉడెం కృష్ణారెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్, గజ్వేల్