చేర్యాల, ఏప్రిల్ 10: ఈనెల 27న వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు జనగామ నియోజకవర్గం నుంచి భారీగా జనసమీకరణ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించారు. దీనికోసం ఆయన చేర్యాల ప్రాంతంలో పల్లెపల్లెనా.. వాడవాడనా భారీగా వాల్‌రైటింగ్ చేయిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం నాటి రోజులు గుర్తుచేస్తూ వారం రోజులుగా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాలతో పాటు జనగామలో ప్రత్యేకమైన కొటేషన్లతో కూడిన వాల్‌రైటింగ్ చేయిస్తున్నారు.
వాల్‌రైటింగ్స్ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. ‘మన ఇంటి పార్టీ-బీఆర్ఎస్ పార్టీ రజితోత్సవ సభ’ ఆహ్వాన పత్రం పేరిట ప్రత్యేకంగా బ్రోచర్లు తయారుచేసి వాటిని పంపిణీ చేయిస్తున్నారు. సభను విజయవంతం చేసేందుకు ఎమ్మెల్యే పల్లా తనదైన శైలిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి బృందానికి ఒక ఇన్చార్జిని నియమించారు. ప్రతి గ్రామంలో 15వరకు వాల్ రైటింగ్స్ చేయిస్తున్నారు. 54గ్రామాల్లో ఇప్పటికే 500కు పైగా గోడలపై ఎల్కతుర్తి సభ విజయవంతం చేయాలని కోరుతూ వాల్‌రైటింగ్స్ పూర్తిచేయింశారు. వాల్‌రైటింగ్‌లు పూర్తికాగానే గ్రామాల్లో జెండాల గద్దెల నిర్మాణం చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇప్పటికే నియోజకవర్గంలో మండలాల వారీగా సన్నాహాక సమావేశాలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పూర్తిచేశారు. సభకు వచ్చే పార్టీ శ్రేణులతో పాటు అభిమానులకు రూట్‌మ్యాప్ ఇవ్వడంతో పాటు ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను ఎంగేజ్ చేసుకున్నారు. సభకు వచ్చే ప్రతి 25 మందికి ఒక్క ఇన్చార్జిని నియమిస్తున్నారు. సభకు వచ్చినవారి వివరాలను సదరు ఇన్చార్జి ప్రత్యేకంగా నోటు పుస్తకంలో రాసుకోవడంతో పాటు సభకు వచ్చినప్పటి నుంచి తిరిగి ఇంటికి చేరుకునే వరకు సదరు ఇన్చార్జికి బాధ్యతలు అప్పగిస్తూ తీర్మానాలు చేశారు.