సిద్దిపేట, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటింది.మూడు విడతల్లోనూ అధికార పార్టీని దీటుగా ఎదుర్కొని ఘన విజయం సాధించింది.పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం నెలకొంది. జీపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జైత్రయాత్రను అడ్డుకోవడానికి సిద్దిపేట, మెదక్ ,సంగారెడ్డి జిల్లాల్లో చాలాచోట్ల అధికార కాంగ్రెస్, బీజేపీ కలిసి పోటీచేశాయి. కానీ, ఒంటరిగా పోటీ చేసి బీఆర్ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లాలో మరోసారి తనసత్తా చాటింది. సిద్దిపట జిల్లాలో 508 గ్రామ పంచాయతీలకు 279 బీఆర్ఎస్, 160 కాంగ్రెస్, 24, బీజేపీ, 45 ఇతరులు గెలిచారు. మెదక్ జిల్లాలో 492 గ్రామ పంచాయతీలకు 189 బీఆర్ఎస్, 243 కాంగ్రెస్, 21 బీజేపీ, 39 ఇతరులు గెలిచారు. సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామాలకు 198 బీఆర్ఎస్, 376 కాంగ్రెస్, 8 బీజేపీ, 31 ఇతరులు గెలిచారు. ప్రభుత్వం మీద వ్యతిరేకతతో చాలాచోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులుగా బరిలో దిగేందుకు ఆసక్తి చూపారు.
ఒక్కో గ్రామంలో ఇద్దరు నుంచి ముగ్గురు బీఆర్ఎస్ మద్దతుదారులుగా నిలబడడంతో కొంతమేర సీట్లు తగ్గాయి. లేకపోతే మరిన్ని సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచేవారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1613 గ్రామ పంచాయతీలకు బీఆర్ఎస్ 666 బీఆర్ఎస్ గెలిచింది. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, జనగామ నియోజకవర్గాల్లో అత్యధికంగా స్థానాల్లో గెలుపొందింది. మెదక్ జిల్లాలో నర్సాపూర్ నియోజకవర్గంలో అత్యధికంగా సర్పంచ్‌లను బీఆర్ఎస్ గెలుచుకుంది.
మిగతా నియోజకవర్గాలలో కాంగ్రెస్, బీజేపీలను దీటుగా ఎదుర్కొంది. సంగారెడ్డి, మెదక్, ఆందోల్, జహిరాబాద్, నారాయణ్‌ఖేడ్, పటాన్చెరు,హుస్నాబాద్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీగా తలపడ్డాయి. పార్టీలకతీతంగా జరిగిన ఎన్నికలు కావడంతో కొంత మేర అభ్యర్థి ప్రభావం ఉంటుంది. త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పార్టీ సహితంగా జరుగుతాయి కాబట్టి, మూడు జడ్పీపీఠాలు, అత్యధిక ఎంపీపీలను బీఆర్ఎస్ దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సరికొత్త రికార్డును సృష్టించింది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని పలు మేజర్ (పెద్ద) గ్రామ పంచాయతీల్లో గులాబీ జెండాను ఎగురవేయడంతో కాంగ్రెస్ కంగు తిన్నది.
ప్రభావం చూపని బీజేపీ
ఉమ్మడి మెదక్ జిల్లాలో బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేక పోయింది. మెదక్ ఎంపీతో పాటు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉన్నా జిల్లాలో బీజేపీ సర్పంచ్‌లు పెద్దగా విజయం సాధించలేక పోయారు. ఉమ్మడి జిల్లాలో 1613 పంచాయతీలకు 58 గ్రామాల్లో మాత్రమే బీజేపీ గెలిచింది. సిద్దిపేట జిల్లాలో 29, మెదక్ జిల్లాలో 21, సంగారెడ్డి జిల్లాలో 8 సర్పంచ్‌లు మాత్రమే గెలిచారు. చాలా గ్రామాల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పోటీచేశాయి. అందుకే బీజేపీకి ఈ మాత్రం సీట్లు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీ ఎత్తులు చిత్తు
అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తులను ప్రజలు చిత్తు చేశారు. అధికారం అండచూసుకుని కాంగ్రెస్ చాలా గ్రామాల్లో బలప్రయోగం చేసింది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి దామోదర్ రాజనర్సింహా, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బెదిరింపులకు దిగారు. గెలిచి తీరాలని కాంగ్రెస్ అడ్డదారులు తొక్కింది.విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసి ఓటర్లను ప్రభావితం చేశారు. మద్యం ఏరులై పారించారు. ఇతర ప్రలోభాలకు గురిచేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి సభ పెట్టి ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కారు. ఇందిరమ్మ చీరలు పంచుడు, మహిళలకు పావలా వడ్డీ రుణాలు ఇచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని పంచాయతీ ఎన్నికల్లో పైచేయి సాధించడానికి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని కాంగ్రెస్ సద్వినియోగం చేసుకున్నా, పల్లె ఓటర్లు బీఆర్ఎస్ను ఆదరించారు.
