సిద్దిపేటరూరల్, మే 13: చింతమడక ప్రజలు మురిసిపోయారు. తమ ఇంటి ముద్దుబిడ్డ గ్రామానికి రావడంతో ఆనందానికి లోనయ్యారు. గులాబీ అధినేత కేసీఆర్ తన సతీమణి శోభతో కలిసి సిద్దిపేట రూరల్ మండలం చింతమడక స్వగ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం ఉదయం 11ః15 నిమిషాలకు ఎర్రవల్లి నివాసం నుంచి హెలిక్యాప్టర్‌లో ఆయన చింతమడకకు చేరుకున్నారు.
హెలిప్యాడ్ నుంచి భారీ బందోబస్తు నడుమ కాన్వాయ్‌లో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. కేసీఆర్ రాక విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలింగ్ కేంద్రానికి భారీగా తరలివచ్చారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడంతో పోలీసులు కట్టడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. పోలింగ్ కేంద్రం బయట అప్రమత్తమైన పోలీసులు ప్రజలను నిలువరించారు.