మెదక్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ) : సమగ్ర శిక్షా ఉద్యోగులు 13 రోజులుగా సమ్మె చేస్తున్నా కాంగ్రెస్ సర్కార్‌కు కనిపించడం లేదా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. మెదక్ కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు ఆయన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ…రేవంత్‌రెడ్డికి అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైంది కానీ, ప్రజల సమస్యలు ముఖ్యం కావా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 20 వేల సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు రోడ్డు మీద పడితే ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.
రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చాయ్ తగినంత సమయంలో సమస్యలు పరిషరిస్తా అని మాట తప్పారని విమర్శించారు. డిసెంబర్ 9 నుంచి సమ్మె చేస్తుంటే ఎందుకు సమగ్ర శిక్షా ఉద్యోగులను పిలిచి వారి సమస్యలను పరిష్కరించడం లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో నిలదీసినా స్పందన లేదన్నారు. అన్నివర్గాలను రేవంత్ రెడ్డి, మంత్రులు మోసం చేశారని దుయ్యబట్టారు. అసలు విద్యాశాఖకు మంత్రి లేడని, బడ్జెట్లో 15 శాతం నిధులు అని, 7 శాతం కూడా పెట్టలేదన్నారు. నిరసన చేపట్టడం వల్ల లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం అయ్యిందన్నారు.
గ్రీన్ చానెల్ నిధులు అనేది వట్టి మాటలేనని, సస్పెండ్ చేయాల్సింది వార్డెన్లు, ప్రిన్సిపాళ్లను కాదని, రేవంత్ రెడ్డిని చేయాలని ఘాటుగా విమర్శించారు. ఉన్న పథకాలు ఇవ్వరు, కొత్త పథకాలు లేవని, పింఛన్లు పెంచుతామని మోసం చేశారన్నారు. వృద్ధాప్య పింఛన్లు రెండు నెలలుగా ఎగ్గొట్టాడని, మాజీ సర్పంచులకు బిల్లులు ఇవ్వడం లేదని, ప్రశ్నిస్తే ఎకడికకడ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. రేవంత్ ఇచ్చిన హామీ అమలు చేసేదాకా నిరంతరం మీకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, సమస్య పరిషారమయ్యేదాకా కొట్లాడుదామని పిలుపునిచ్చారు. ఈ నెల 25న మెదక్ చర్చికి వస్తున్న రేవంత్‌కు చీము నెత్తురు ఉంటే సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె చేస్తున్న టెంట్ వద్దకు రావాలని డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించండి… రేవంత్‌ను నిలదీయాలని ఆయన సూచించారు.