సిద్దిపేట, నవంబర్ 17: యాదవుల అభివృద్ధికి గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చాలా ప్రాధాన్యం ఇచ్చారని, యాదవులు కోసం రూ.వేల కోట్లు ఖర్చు పెట్టిన ఘనత కేసీఆర్‌దేనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో చింతల అజయ్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ ఉత్సవంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. హరీశ్‌రావు అంటే సిద్దిపేట.. సిద్దిపేట అంటే హరీశ్‌రావు అనే బ్రాండ్ ఇమేజ్ ఉన్న ప్రజానాయకుడు అన్నారు. నిరంతరం ప్రజల కోసం,అభివృద్ధి కోసం పరితపించే నాయకుడు సిద్దిపేట ప్రజలకు దొరకడం అదృష్టమన్నారు.
వచ్చే సంవత్సరం నుంచి అందరూ సిద్దిపేటలో కలిసి సదర్ నిర్వహించాలన్నారు. హైదరాబాద్‌లో కూడా సదర్ నారాయణగూడలో గొప్పగా నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో సుమారు 60 లక్షల మంది యాదవ జనాభా ఉన్నదని, భవిష్యత్‌లో యాదవుల ఐక్యతకు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. బీసీ కులాల్లో చైతన్యం వస్తున్నదని, యాదవుల్లో ఐక్యత దెబ్బ తీయడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారన్నారు. యాదవ కులానికి చెందిన వ్యక్తిని రాజ్యసభకు పంపిన ఘనత కేసీఆర్‌దేనని.. ఆరుగురు ఎమ్మెల్యేలను చేశాడని గుర్తుచేశారు. ఎంతో మందికి కార్పొరేషన్ పదవులు ఇచ్చి గౌరవించారన్నారు. ఇప్పటి ప్రభుత్వంలో యాదవులు లేనే లేరని, తాను ఒకడినే ఎమ్మెల్యే అని తలసాని అన్నారు. యాదవుల కోసం హైదరాబాద్‌లో ఐదెకరాల స్థలం ఇచ్చి ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
సదర్ అంటే అందరి పండుగ అని, పండుగ అనేది కులాల మధ్య ఐక్యత పెంచుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అన్నారు. హైదరాబాద్, తెలంగాణకు ఒక ప్రత్యేకత ఉందని, ప్రపంచంలో పూలను పూజించే పండుగ తెలంగాణలో ఉందన్నారు. బోనాల పండుగ.. అమ్మవారి కోసం గొప్పగా నిర్వహించే పండుగ కూడా హైదరాబాద్‌కే సొంతమన్నారు. అడవి జంతువులను సాధు జంతువులుగా మార్చిన ఘనత యాదవులకే దక్కుతుందన్నారు. కేసీఆర్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందన్నారు.
ఇప్పుడు సీఎం ఏడాదిలో ఏం తకువ చేశామని మాట్లాడుతుండు.. రేవంత్‌రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత పథకాలన్నీ బంద్ అయ్యాయన్నారు. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, రైతుబంధు, యాదవులకు గొర్రె పిల్లల పంపిణీ పథకం బంద్ చేశాడన్నారు. రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో ఉండి మాట్లాడటం కాదని, గల్లీలోకి వచ్చి అడిగితే అభివృద్ధి ఏంటో తెలుస్తుందన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. యాదవుల కోసం పోరాడిన వ్యక్తి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు పోచబోయిన శ్రీహరి యాదవ్, తెలంగాణ ఉద్యమ నేత రాజారామ్‌యాదవ్, చింతల అజయ్ కుమార్ యాదవ్, మామిండ్ల ఐలయ్య యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ కడవెరుగు రాజనర్సు, రాజ యల్లయ్యయాదవ్, కౌన్సిలర్లు బర్ల మల్లికార్జున్, మొయిజ్, గుడాల సంధ్యాశ్రీకాంత్ పాల్గొన్నారు.