జనగామ రూరల్, నవంబర్ 2 : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతోపాటు జనగామలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి పెంబర్తిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని పెంబర్తి, ఎల్లంల, సిద్దెంకి, పెద్దరాంచర్ల, ఓబుల్ కేశ్వాపూర్, పసరమడ్ల, శామీర్‌పేట గ్రామాల్లో రైతుబంధు సమితి చైర్మన్, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే, జనగామ ఎన్నికల ఇన్చార్జి తాటికొండ రాజయ్యతో కలిసి పల్లా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బతుకమ్మ, కోలాటం ఆటలు, ఒగ్గుడోలు, కనకడప్పుల మోతలు, బోనాల ఆటలు, మంగళహారతులతో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఎక్కడ చూసినా మహిళలు ముందుండి పల్లాను అక్కున చేర్చుకున్నారు. ప్రతి గడపకు తిరుగుతూ ప్రతిఒక్కరినీ పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని పల్లా కోరారు.
ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని పల్లెలో హనుమంతుడి గుడిలేని గ్రామం లేదు, బీఆర్ఎస్ సంక్షేమ పథకం అందుకోని ఇల్లు లేదన్నారు. యువతకు ఉపాధి కల్పించేందుకు ఇక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ పార్కు ఏర్పాటు చేస్తామన్నారు. దీంతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, పామ్ఆయిల్ ఇండస్ట్రి, నర్సింగ్, పాలిటెక్నిక్ కళాశాలలను నిర్మించుకుందామన్నారు. ఇక్కడ అనేక పరిశ్రమలు నెలకొల్పేందుకు పాటుపడుతానన్నారు. ప్రతి గ్రామాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చెబుతున్నా మాట లు నమ్మేస్థితిలో ప్రజలు లేరన్నారు. గ్రామాల్లో సీసీరోడ్లు, కమ్యూనిటీ భవనాలు మంజూరు చేస్తామని తెలిపారు. ముస్లింలకు ఖబబ్రస్తాన్ నిర్మిస్తామన్నారు. ప్రభు త్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రతిఒక్కరికీ అందేలా కృషి చేస్తానన్నారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. ప్రతి గ్రామం లో అంతర్గత రోడ్లకు నిధులు మంజూరు చేసి వాటిని పూర్తి చేస్తానన్నారు. నిధులు లేకుంటే తనసొంత డబ్బులతో గ్రామాలను అభివృద్ధి చేస్తానని చెప్పారు. గ్రామాల్లో క్రీడామైదానాలు ఏర్పాటుకు తనవంతు సహకారం అందజేస్తానని తెలిపారు.
పల్లెల అభివృద్ధికి మారుపేరైన పల్లాను సీఎం కేసీఆర్ స్వయంగా జనగామకు పంపించారని, పల్లాను గెలిపిస్తే రామబాణం మాదిరిగా అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. జనగామ రూపురేఖలు మార్చడానికి పల్లాను ఇక్కడికి సీఎం కేసీఆర్ పంపించారని తెలిపారు. పల్లా గెలుపు.. జనగామ అభివృద్ధికి మలుపు అయితదన్నారు. అనంతరం పలు గ్రామాల నుంచి వివిధ పార్టీలకు చెంది కార్యకర్తలు పల్లా సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరినవారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్దె సిద్దిలింగం, ఎంపీపీ మేకల కలింగరాజు, జడ్పీటీసీ నిమ్మతి దీపిక, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బైరగోని యాదగిరిగౌడ్, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు చినబోయిన రేఖ, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ బూరెడ్డి ప్రమోద్‌రెడ్డి, సర్పంచుల, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాళ్లు బొల్లం శారద, బండ లక్ష్మి, సర్పంచులు అంబాల ఆంజనేయులుగౌడ్, ఎర్ర సుజాత, ఏళ్ల సుజాత, కొమ్ము సుజాతాజగదీశ్, శివరాత్రి స్వప్నారాజు, తాండ్ర స్వరూప, వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు చినబోయిన నర్సయ్య, శ్రీను, మడిపల్లి సుధాకర్‌గౌడ్, రాజు, పరశురాములు, డానియల్, మైసాగౌడ్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.