జిన్నారం, జూన్ 20: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని జిన్నా రం, పటాన్చెరు, అమీన్పూర్,రామచంద్రపురం మండలాలకు చెందిన రైతుల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను ప్రభు త్వం జమచేయలేదు. బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా జిన్నారంలో నేడు మహాధర్నాకు పిలుపునిచ్చినట్లు ఆపార్టీ జిన్నారం అధ్యక్షుడు రాజేశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
స్థానిక అంబేదర్ చౌరస్తాలో శనివారం ఉదయం 9:30 గంటలకు నిర్వహించనున్న ధర్నా కార్యక్రమానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు సంబంధించి 27,120 రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేవలం జిన్నారం మండలంలోనే 10వేల పైచిలుకు రైతులకు భరోసా లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గాలేదని మండిపడ్డారు. రూ.12.99 కోట్ల రైతు భరోసా నిధులను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తక్షణమే రైతుల ఖాతాల్లో జమ చేయాలని, లేనిపక్షంలో ప్రభుత్వంపై పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు. ధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.