మెదక్ : లగచర్లలో రైతులపై (Lagacharla Farmers) పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు (BRS leaders ) మంగళవారం మెదక్లో అంబేద్కర్ విగ్రహానికి (Ambedkar Statue) వినతి పత్రం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, ఎంఎల్సీ శేరి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లగచర్ల రైతులపై థర్డ్ డిగ్రీ ఉపయోగించి, జైలులో పెట్టడం సరైనది కాదన్నారు. రైతుల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ( Congress) ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీయాలన్నారు. నిరంకుశ పాలనను నిరసిస్తూ.. ప్రజలంతా అన్నదాతలకు మద్దతు తెలుపాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ అమాననీయ, అణచివేత ధోరణికి పాల్పడుతుందని ఆరోపించారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి, జైలులో నిర్బంధించిన రైతులను విడుదల చేసే వరకు పోరాటం చేస్తామన్నారు. రైతు లేనిదే రాజ్యం లేదన్నారు. రైతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామన్నారు.