సిద్దిపేట, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ సర్కారు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నది. ప్రజాపాలన అందిస్తామంటూ అధికారంలో వచ్చి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండించినందుకు, కాంగ్రెస్ దౌర్జన్యాలను ప్రశ్నించినందుకు బీఆర్ఎస్ శ్రేణులపై కక్షగట్టింది. అందులో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నేతల హౌస్ అరెస్ట్‌ల పర్వం కొనసాగింది. గురువారం అర్ధరాత్రి నుం చి పోలీసులు బీఆర్ఎస్ నేతల ఇండ్లలోకి వెళ్లి నేతలను పోలీస్స్టేషన్లకు తరలించారు.
మరికొంత మంది నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. చివరకు శుక్రవారం సాయ ంత్రం బీఆర్ఎస్ నేతలను విడుదల చేశారు. బీఆర్ఎస్ నాయకులు అక్రమ అరెస్ట్‌లను పార్టీ తీవ్రంగా ఖండించింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి పోలీసులు కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకుల, గృహనిర్బంధాలు, అక్రమ అరెస్ట్‌లను పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీ రు హరీశ్‌రావును హైదరాబాద్‌లోని కోకాపేటలో తన స్వగృహంలో హౌస్ అరెస్ట్ చేశారు. భుజానికి దెబ్బ తగి లి దవాఖానకు వెళ్తానంటే కూడా పోలీసులు హరీశ్‌రావుకు అనుమతించలేదు.
చివరకు ఉన్నతాధికారుల అనుమతితో దవాఖానకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రాష్ట్రంలో ప్రజా పాలన ఉందా..? అని పార్టీ శ్రేణులు ప్రశ్నించారు. ఇది రాక్షస పాలనలా ఉందని బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కోకాపేటలో హరీశ్‌రావును పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత, అందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ను గేట్ వద్దనే ఆపి అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిని గచ్చిబౌలిలోని తన స్వగృంలో హౌస్ అరెస్ట్ చేశారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలను, ఇతర పార్టీ నేతలను, ముఖ్యులను హౌస్ అరెస్ట్ చేయగా, మరికొంత మందిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్స్టేషన్లకు తరలించారు.దీంతో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులపై ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగాయి. తమ నేతలను విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ కార్యర్తలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ దిష్టిబొమ్మలను దహనం చేశారు.బీఆర్ఎస్ కార్యకర్తలు, సానుభూతి పరులు ఎకడికకడే స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.
తమ ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను విడిచిపెట్టి తమ నేతలను అరెస్ట్ చేయడం ఏమిటని పోలీసులను ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎకడికకడ ముందస్తు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన బీఆర్ఎస్ శ్రేణులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకుండా, బీఆర్ఎస్ శ్రేణులను అరెస్టులు చేయడం అప్రజాస్వామికం అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, వారి అనుచరులు, కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.