మెదక్, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : మెదక్ ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఎమ్మెల్యే రోహిత్ వ్యాఖ్యలు ఉండాలి.. కానీ అతని వ్యాఖ్యలు దిగజార్చే విధంగా ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. ఈ నెల 17న మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ అతనిపై కేసు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మెదక్ ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ… సిద్ధాంతపరంగా విమర్శలు చేసుకోవాలి కానీ ఇది సమంజసం కాదని అన్నారు. మెదక్ ప్రజల గౌరవాన్ని పెంచే విధంగా ఎమ్మెల్యే వ్యాఖ్యలు ఉండాలి… కానీ అతని వ్యాఖ్యలు దిగజార్చి విధంగా ఉన్నాయని తెలిపారు. చట్టాలు చేసే ఎమ్మెల్యేనే అలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని విమర్శించారు. సమాజానికి ఏమి మెసేజ్ పంపుతున్నారని ధ్వజమెత్తారు. పద్ధతి మార్చుకొని మెదక్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారనీ వాటిని నెరవేర్చి మెదక్‌ను అభివృద్ధి పథంలో నడిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ఆరు గ్యారెంటీలను అమలుపరచాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సందర్భంగా రకరకాల హామీలు ఇచ్చి కుట్రపూరితంగా మాట్లాడి ఇక్కడ ప్రజలతో ఓట్లు వేయించుకొని ఇక్కడి ప్రజలను మోసం చేశారని పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాయాయంపేటలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఫిర్యాదు చేస్తే ఇది మా పరిధిలోకి రాదంటూ ఆ ఫిర్యాదు రిజెక్ట్ చేయడం జరిగిందని తెలిపారు. అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రవీందర్ రెడ్డిని పోలీస్‌స్టేషన్ తీసుకువచ్చి కొట్టి అతని ఫోన్ సీజ్ చేశారు.. ఇది ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. పోలీసులు ఈ కొట్టుడు సంస్కృతి ఏంటని అన్నారు. తప్పు చేస్తే కేసు నమోదు చేయాలన్నారు. కానీ పోలీసుల పనితీరు ప్రభుత్వానికి ఒక న్యాయం, ప్రతిపక్షాలకు ఒక న్యాయంలా ఉందని అన్నారు. ప్రజాస్వామ్యంలో చట్టం అందరికీ సమానమే అని తెలిపారు. కానీ పోలీసుల తీరు ప్రజాస్వామ్యయుతంగా లేదని చెప్పారు. పోలీసుల చర్య ద్వారా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను భయపెడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టి కేసులు పెడితే ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రోహిత్ మీద కేసు నమోదైన తర్వాత మా కార్యకర్తలను ముట్టుకోవాలని పద్మాదేవేందర్ రెడ్డి తెలిపారు. మొదట మాట్లాడింది ఎమ్మెల్యే అని గుర్తు చేశారు. అతనిపైన చర్యలు తీసుకున్న తర్వాతనే కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే చేసిన అనుచిత వ్యాఖ్యలు చాలామంది ట్రోల్ చేశారని.. వాళ్లపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. మంచినీళ్ల కోసం, కరెంటు కోసం, రైతు భరోసా కోసం రాక రైతుల అవస్థలు పడుతున్నారు వాళ్ల గురించి ఆలోచించాలని అన్నారు. మెదక్‌లో ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో వాళ్ల సమస్యలు ఎవరికి చెప్పాలో తెలియక మెదక్ నియోజకవర్గ ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. అలాంటిది తెలంగాణ గుండెలో నిలిచిన వ్యక్తి కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తావా మిమ్మల్ని ఇందుకేనా ఇక్కడ ప్రజలు గెలిపించిందని విమర్శించారు.