సిద్దిపేట, జూలై 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ సమాయత్తం అవుతుంది. ఆదిశగా పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేస్తుంది. గ్రామ, మండల, నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ దిశా నిర్దేశం చేస్తున్నారు. గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో పార్టీ శ్రేణులను స్థానిక ఎన్నికలకు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
సిద్దిపేటలో పార్టీ క్యాడర్‌కు పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల వారీగా పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పార్టీ క్యాడర్‌కు సూచనలు చేస్తూ గ్రామాల వారీగా పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బెజ్జంకిలో కార్యకర్తల సమావేశం నిర్వహించి పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేశారు.
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ ముఖ్యనాయకులకు స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంతో వారంతా ఆయా నియోజకవర్గాల్లో పార్టీ క్యాడర్‌తో సమాలోచనలు చేస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో గ్రామాల వారీగా పార్టీ క్యాడర్‌ను సమాయత్తం చేస్తున్నారు. ఆయా రిజర్వేషన్ల వారీగా స్థానిక అభ్యర్థులపై ఆరా తీస్తున్నారు. పార్టీ కోసం ఆహర్నిశలు కష్టపడి పనిచేస్తున్న క్యాడర్‌ను రంగంలోకి దించడానికి సిద్ధం చేస్తున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ అన్ని స్థానాలను గెలుచుకొని మూడు జడ్పీ పీఠాలను కైవసం చేసుకోవడంతో పాటు, ఎంపీపీలు గెలుచుకొని మరోసారి బీఆర్ఎస్ తన సత్తా చాటాలని చూస్తోంది. పార్టీ ఆవిర్భావం నుంచి ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్కు పెట్టని కోట ..త్వరలో జరగనున్న ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సమాయత్తం అవుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల సమావేశాల్లో హరీశ్‌రావు పాల్గొనే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
కాంగ్రెస్ వైఫల్యాలే ఎజెండాగా ముందుకు..
అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలనే ఎజెండా బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లనున్నది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 20 నెలలు దాటుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ప్రభుత్వం నిర్వహించక పోవడం మూలంగా అభివృద్ధి ఎక్కడికక్కడ నిలిచిపోయింది. గ్రామాల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. పారిశుధ్యం పడకేసింది. రైతులకు పూర్తిగా పంటరుణమాఫీ చేయలేదు.
గత రెండు సార్లు రైతు భరోసా నిధులు ఎగ్గొట్టింది. ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి రాజ్యమేలుతుంది. డబ్బులు ఇచ్చిన వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారు. కల్యాణలక్ష్మి, సీఎం రిలీఫ్‌ఫండ్ వంటి పథకాలకు డబ్బులు ఇస్తేనే కాంగ్రెస్ నాయకులు చెక్కులు ఇస్తున్నారు. మహిళలకు ఇస్తానన్న పథకాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పెంచుతామన్న పింఛన్ డబ్బులు ఇంత వరకు పెంచలేదు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఇస్తానన్న 42 శాతం రిజర్వేషన్లపై స్పష్టత లేదు. డిక్లరేషన్ల పేరిట వివిధ వర్గాలకు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవ్వాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆవర్గాలను మోసం చేసింది. ఏ ఒక్క వర్గానికి న్యాయం చేయలేదు. ఇలా పలు విషయాలను గ్రామాల్లో ప్రజల ముందు చర్చ పెట్టనున్నారు. ఆదిశగా పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ఎరువులు కొరత విపరీతంగా ఉండగా రైతులు ఇబ్బంది పడుతున్నారు.
గంటల తరబడి క్యూలో ఉన్నా ఎరువులు దొరకని పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లాలో నెలకొన్నది. సరైన వర్షాలు పడక చెరువులు, కుంటలు బోసిపోయి కనిపిస్తుండగా రైతుల నారుమడులు ముదిరిపోతున్నాయి. కాళేశ్వరం జలాలు విడుదల చేస్తేనే రైతులు వరి నాట్లు వేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఆదిశగా ఈ ప్రభుత్వం ఆలోచనలు చేయడం లేదు. సాగు నీటి విషయంలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరు చేయనున్నది. ఇప్పటికే గజ్వేల్ ప్రాంత రైతులు సాగు నీటి కోసం ధర్నాలు చేసిన విషయం తెలిసిందే.