నారాయణఖేడ్, డిసెంబర్ 17: లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నారాయణఖేడ్‌లోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వినతిపత్రం సమర్పించారు. అంతకుముందు బీఆర్ఎస్ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌక్ వరకు నల్లబ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించగా, పలువురు బీఆర్ఎస్ నాయకులు సంకేళ్లతో నిరసన తెలిపారు.
అనంతరం మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఫార్మాసిటీ పేరు తో గిరిజన రైతుల భూములను సేకరించి రియల్ దందాకు తెరలేపే కుట్ర చేస్తున్నాడన్నారు. భూసేకరణలో భాగంగా కలెక్టర్‌పై దాడి చేశారనే అభియోగాలపై కేసులు నమో దు చేయగా, కలెక్టర్ మాత్రం తనపై దాడి జరగలేదని చెప్పడం పోలీసులు అక్రమ కేసులు పెట్టారనడానికి నిదర్శనమన్నారు. సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో ఆత్మహత్య చేసుకున్న మాజీ సర్పంచ్ సాయిరెడ్డి తన చావుకు రేవంత్‌రెడ్డి సోదరులు కారణమని సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నప్పటికీ ఎటువంటి కేసులు నమోదు చేయని పోలీసులు రైతుల విషయంలో మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు.