కొమురవెల్లి, మార్చి 18: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను నింపి ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల చేయాలని మంగళవారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గీస భిక్షపతి ఆధ్వర్యంలో కొమురవెల్లిలో మండుటెండల్లో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కొమురవెల్లి పోలీస్ బొమ్మ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు బైఠాయించడంతో కొమురవెల్లి ఎస్సై రాజు సిబ్బందితో వచ్చి బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు తహసీల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
తపాస్‌పల్లి రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంతానికి సాగునీళ్లు అందించాలని డిప్యూటీ తహసీల్దార్ వేణుగోపాల్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో మండుటెండల్లో సైతం ఈ ప్రాంతంలోని చెరువులన్నీ మత్తడి దూకిన విషయాన్ని గుర్తుచేశారు. ఎండిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కొమురవెల్లి మండలంలో సుమారు 1100 ఎకరాల్లో వరిపంట ఎండిందని, ఇప్పటికీ నీళ్లు విడుదల చేయకపోతే మొత్తం ఎండిపోయే పరిస్థితి వస్తుందని వాపోయారు. భువనగిరి ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి తపాస్‌పల్లి రిజర్వాయర్‌ను పరిశీలించడానికి వచ్చినప్పుడు రెండు రోజుల్లో నీళ్లు వస్తాయని చెప్పారని, ఎంపీ వచ్చి 10రోజులు గడిచినా ఇప్పటికీ నీళ్లు రాలేదన్నారు.
వెంటనే సాగునీరు అందించాలని, లేనిపక్షంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సిలువేరు సిద్దప్ప, మాజీ వైస్ ఎంపీపీ కాయిత రాజేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తలారి కిషన్, ముత్యం నర్సింహులుగౌడ్, మెర్గు కృష్ణాగౌడ్, మాజీ సర్పంచ్‌లు పచ్చిమడ్ల స్వామిగౌడ్, కరుణాకర్, మాజీ ఉప సర్పంచ్ కొండ శ్రీధర్, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు బూర్గు స్వామిగౌడ్, సిలువేరు కనకమల్లేశం, వూడెం గోపాల్‌రెడ్డి, పచ్చిమడ్ల వెంకటేశ్‌గౌడ్, గొల్లపల్లి నాగరాజు, నరేశ్‌బాబు, ఆయా గ్రామాల బీఆర్ఎస్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు.