సిద్దిపేట, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. సిద్దిపేట జిల్లాలో 182 సర్పంచ్ స్థానాలకు 10 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 172 స్థానాలకు ఎన్నికలు ఆదివారం పోలింగ్ నిర్వహించారు. 172 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు 117 మంది గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ 27 స్థానాల్లో, బీజేపీ 12 స్థానాల్లో, 16 మంది స్వతంత్రులు గెలుపొందారు. సిద్దిపేట నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు వన్‌సైడ్ అయ్యాయి. నియోజకవర్గంలో సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్,నారాయణ రావుపేట,చిన్నకోడూరు,నంగునూరు మండలాల్లో మొత్తం 91 గ్రామాలకు 78 చోట్ల బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు.
కాంగ్రెస్ పార్టీ 5, బీజేపీ 2, స్వతంత్రులు 6 స్థానాల్లో గెలిచారు. నంగునూరు మండలం సంతోష్‌నగర్, ఖాత, సిద్దిపేట అర్బన్ పాండవపురం,చిన్నకోడూరు మండలం రామంచ గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకుంది.మిగిలిన 87 గ్రామాల్లో ఎన్నికలు జరగగా, వీటిలో 74 స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకొని సత్తా చాటుకుంది. విజయం సాధించిన సర్పంచ్‌లను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు అభినందించారు. సిద్దిపేట నియోజకవర్గానని అన్నిరంగాల్లో హరీశ్‌రావు అభివృద్ధి చేశారు. ఇది బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి దోహదం చేసింది. కాంగ్రెస్ పార్టీ గ్రామాలకు పైసా నిధులు ఇవ్వక పోవడంతో ఆ పార్టీ మద్దతుదారులకు నష్టం చేకూర్చింది.
సిద్దిపేట జిల్లాలోని దుబ్బాక నియోజకవర్గంలోని దు బ్బాక, భూంపల్లి- అక్బర్పేట, మిరుదొడ్డి, తొగుట మండలాల్లో మొత్తం 67 గ్రామాలకు 4 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. వీటిలో రెండు బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు ఏకగ్రీవం కాగా, మిగతా రెండు స్వతంత్రులు ఉన్నారు.మిగిలిన 63 గ్రామాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో బీఆర్ఎస్ 35, కాంగ్రెస్ 11, బీజేపీ 10, ఇతరులు 07 స్థానాల్లో విజయం సాధించారు. అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించడంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలోని చెగుంట, నార్సింగ్, గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్, మనోహరబాద్, మెదక్ నియోజకవర్గంలోని మెదక్, రామాయంపేట రూరల్, నిజాంపేట మండలాల్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో విజయం సాధించారు.
ఎన్నికల్లో గెలవడం ఒక బాధ్యతగా తీసుకొని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందించాలని నూతనంగా గెలిచిన సర్పంచ్ అభ్యర్థులకు హరీశ్‌రావు సూచించారు. పదవి కాలంలో ఉన్నంతకాలం ప్రజలకు చేసిన సేవలే శాశ్వతంగా గుర్తుండి పోతాయన్నారు. ఈ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక స్థానాలు గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు పేరుపేరునా ఆయన ధన్యవాదాలు తెలిపారు.