సంగారెడ్డి, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ) : పల్లె ఓటర్లు బీఆర్ఎస్ వెన్నంటే నిలిచారు. సంగారెడ్డి జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి 50 పంచాయతీల్లో విజయం కట్టబెట్టారు. స్వతంత్ర అభ్యర్థులు 11 మంది గెలుపొందగా, వారిలో అత్యధికులు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉన్నారు. తొలి విడతలో 129 పంచాయతీలకు ఎన్నికలు జరగగా, 50 స్థానాల్లో బీఆర్ఎస్, 67 స్థానాల్లో కాంగ్రెస్, 2 స్థానాల్లో బీజేపీ మద్దతు దారులు గెలుపొందారు. 11 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
తొలి విడతగా 7 మండలాల్లో ఎన్నికలు జరగగా కొండాపూర్, గుమ్మడిదల, హత్నూర, సదాశివపేట మండలాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులకు ప్రజలు పట్టం కట్టారు. కొండాపూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల కంటే అధికంగా బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. కొండాపూర్ మండలంలో 24 పంచాయతీలకు ఎన్నికలు జరగగా, 14 పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థులు ముగ్గురిలో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ఉండటం గమనార్హం. హత్నూర మండలంలో 34 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 13 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు. గుమ్మడిదలలో ఎనిమిది పంచాయతీలకు నాలుగుచోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. సదాశివపేట మండలంలో 10 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు.
పలుచోట్ల బీఆర్ఎస్ మద్దతుదారుల స్వల్ప ఓట్లతేడాతో ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్లో అవకాశం లభించక కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ బరిలో దిగిన నాయకులు ఎక్కువ సంఖ్యలో విజయం సాధించారు. చాలా పంచాయతీల్లో రెబెల్స్ బీఆర్ఎస్ విజయానికి గండికొట్టారు. సంగారెడ్డి, కంది మండలాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో గెలిచారు. అధికారదుర్వినియోగం, ధనబలంతో అక్కడ కాంగ్రెస్ మద్దతుదారుల విజయం సాధ్యమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు ఆ పార్టీ మద్దతుదారులు పెద్ద మొత్తంలో డబ్బులు పంపిణీ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తేనే మీ వార్డుల్లో అభివృద్ధి పనులు జరగటంతో పాటు కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే సంక్షేమ పథకాలు అందుతాయని కాంగ్రెస్ మద్దతుదారులు ఓటర్లను భయపెట్టడంతో , ఆ పార్టీ మద్దతుదారులకు అనుకూలించింది.
దీనికితోడు అధికార కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికల్లో పోలీసు వ్యవస్థను తమకు అనుకూలంగా మల్చుకుని ఎన్నికల్లో గెలుపొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదాశివపేట, సంగారెడ్డి, కంది మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నికలకు ఒకరోజు ముందు పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. సంగారెడ్డి, హత్నూర, సదాశివపేట, కంది మండలాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జతకట్టాయి. బీజేపీ శ్రేణులు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేయడంతో చాలాచోట్ల కాంగ్రెస్ మద్దతుదారుల విజయం సాధ్యమైంది.