చిన్నశంకరంపేట, ఏప్రిల్ 5 : ఆరు గ్యారంటీలు, 420 హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెసోళ్లు ఎంపీ ఎన్నికల్లో ఏ మొఖం పెట్టుకొని వచ్చి ఓట్లడుగుతారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలోని శ్రీనివాస్ గార్డెన్లో శుక్రవారం మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ.. 6 గ్యారెంటీలు వంద రోజుల్లో అమ లు చేస్తామని హామీ ఇచ్చి నేటికి అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందన్నారు. డిసెంబర్ 9న రైతులకు రూ.2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, వంద రోజులు దాటినా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. మహిళలకు రూ. 2500 సాయం, వృద్థులు, వితంతువులకు రూ. 4000 పింఛన్ ఇస్తామని చెప్పి అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. రూ.4 వేల చొప్పున పింఛన్ రాని వారంతా కారుగుర్తుకు ఓటేసి కాంగ్రెస్ తగిన బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మెదక్ ఎంపీగా గెలుపొందడం ఖాయమన్నారు. బీజేపీ దేవుడి పేరుతో ఓట్లను దండుకోవాలని ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. 400 రూపాయలు ఉన్న గ్యాస్ ధర వెయ్యి రూపాయలకు, 60 రూపాయలు ఉన పెట్రోల్ ధర రూ.110కి పెంచిన ఘనత బీజేపీదే అన్నారు. కేంద్రంలో పదేండ్లు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిందేమి లేదన్నారు.
ఎంపీగా గెలిచిన నెలరోజుల్లోనే రూ.100 కోట్లతో పీవీఆర్ ట్రస్టు ఏర్పాటు చేసి పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తానని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. పేద విద్యార్థులకు కోచింగ్ ఇప్పిస్తానని, నియోజకవర్గంలో ఒక ఫంక్షన్‌హాల్ నిర్మించి రూపా యి ఖర్చులేకుండా శుభకార్యాలను చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల కష్టసుఖాలు తనకు తెలుసు అని, పేదలకు అండగా ఉంటానన్నారు.
కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మె ల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సూచించారు. కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. హామీలు ఎందుకు అమలు చేయడం లేదని ప్ర శ్నించారు. ఓడినా గెలిచినా తాను ప్రజల మ ధ్య ఉండి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ ఏకే గంగాధర్‌రావు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, జడ్పీటీసీలు మాధవి, కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీలు సత్యనారాయణగౌడ్, సుజాత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, లక్ష్మారెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ అంజిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు కుమార్‌గౌడ్, నాగరాజు, లక్ష్మణ్, భిక్షపతిగౌడ్, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు, సింగిల్‌విండో చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.