బీఆర్ఎస్ ప్రయోగించిన ఆరడుగుల బుల్లెట్టు సరిగ్గా అధికారపార్టీ గుండెల్లో దిగింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో రెండు రోజుల క్రితం వరకు ప్రమాదంలో చనిపోయినవారిని పట్టించుకున్న నాథుడు లేడు. డబ్బులు ఎవరిస్తారు?ఎప్పుడిస్తారు అని చెప్పే అధికారి లేడు. హెల్ప్‌డెస్క్‌ల జాడ గల్లంతైంది. ఏదిక్కులేనివారికి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును కలిసి బాధిత కుటుంబాలు మొరపెట్టుకున్నాయి. తమ దుస్థితిని వివరించాయి. గుండెలు కదిలించే బాధలో ఉన్న మృతుల కుటుంబాల తరపున హరీశ్‌రావు రంగంలోకి దిగారు
పటాన్చెరు రూ రల్, జూలై 30: అసలు సిగాచి మృతులెంత మంది? వా రికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన రూ. కోటి ఎందుకు ఇవ్వడం లేదు. మిస్సైన వ్యక్తుల కుటుంబాలకు డెత్ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వడం లేదు.? గాయాలపాలైనవారికి సరైన చికిత్స ఎందుకు చేయడంలేదంటూ సంగారెడ్డి కలెక్టరెట్లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి అధికారులను ప్రశ్నించారు. ఆయన నిలదీతకు అధికారుల వద్ద ఏజవాబు లేదు.
అసలు 54 మరణాలకు కారణమైన కంపెనీ యజమానిని ఎందుకు అరెస్టు చేయరంటూ అడిగిన ప్రశ్నకు అధికారులు దిక్కులు చూశారు. మాకు నష్టపరిహారం ఎవరూ ఇవ్వడం లేదు సారు.. అంటూ బాధిత కుటుంబీకులు కన్నీటి పర్యంతమయ్యారు. సిగాచి పరిశ్రమ నష్టపరిహారం చెల్లింపులు, దర్యాప్తు వ్యవస్థ లోపాలను మీడియా ముందు బాధిత కుటుంబాలు బహిర్గతం చేశాయి.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పరిశ్రమతో లాలూచీ పడ్డారని హరీశ్‌రావు చేసిన ఆరోపణలతో ప్రభుత్వంలో కలవరం మొదలైంది. హరీశ్‌రావు సంధించిన ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరైన ప్రభుత్వం, అధికారులు యాజమాన్యంపై ఒత్తిడి పెంచా యి. మరో పక్క సిగాచి యాజమాన్యం బాధితులకు నష్టపరిహారం చెల్లింపులో వెనక్కి తగ్గుతుందనే వార్తలు షేర్ మార్కెట్లోనూ చక్కర్లు కొట్టాయి. దీంతో పరిశ్రమ యాజమాన్యంలోనూ చర్చ మొదలైంది.
రండి మీ డబ్బులు తీసుకువెళ్లండి
నిన్నటి దాకా బాధిత కుటుంబాలను కలిసేందుకు కూడా ఆసక్తి చూపించని పరిశ్రమ యజమానులు ఇప్పుడు బాధిత కుటుంబ సభ్యులకు వారి అధికారులతో ఫోన్లు చేయించి మాట్లాడిస్తున్నారు. మీకు భయం లేదు. మేమున్నాం. మీరు ఏ లీడర్ వద్దకు వెళ్లకండి. మీకు మేము న్యాయం చేస్తామంటూ ఫోన్లు చేసి బతిమాలుతున్నారు. మీరు మమ్మల్ని నమ్మండి. మీ డబ్బులకు మా పూచీ అంటూ నమ్మకంగా మాట్లాడుతున్నారు. మూడు రోజుల క్రితం వరకు మీరెవరు అనట్లుగా ఉన్న వ్యవస్థలో ఇప్పుడు భారీ మార్పులు వచ్చాయి. పోలీసు పవర్‌తో బాధితులను బెదిరించిన గొంతులు తగ్గా యి.
బుజ్జగించి బాధితులతో మాట్లాడుతున్నారు. దానికి కారణం ఒకే ఒక్కడు హరీశ్‌రావు. ఇప్పటి దాకా చీదరింపులు, బెదిరింపులు, భయాందోళనలు చూసిన సిగాచి బాధిత కుటుంబాలకు ఇప్పుడు పరిశ్రమ ప్రతినిధులు గౌరవంగా చూస్తున్నారు. సిగాచి హెడ్ ఆఫీసు హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులు పిలిపించిన కొన్ని కుటుంబాలను టీఎస్ఐఐసీలో కలిసి చెక్కులు పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి దాకా రూ. 10లక్షలు ఇచ్చారు. దానికి అదనంగా మరో రూ. 15లక్షలు ఇవ్వడం ప్రారంభించారు. ఫోన్లు చేసి ఐలా కార్యాలయం పాశమైలారం గ్రామానికి రప్పిస్తున్నారు. కార్మికశాఖ అధికారుల సమక్షంలో చెక్కులు పంపిణీ చేసి గౌరవంగా బాధిత కుటుంబాలను పంపిస్తున్నారు.
మిగిలిన డబ్బులను కూడా ఇస్తామని వాగ్దానం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన మృ తులు 10మంది ఉండగా వారి కుటుంబాలను మంగళవారం పి లిపించి రూ. 15 లక్షల చె క్కులు అందజేశారు. తెలంగాణకు చెందిన నాలుగు కుటుంబాలకు కూడా రూ. 15లక్షల చొప్పున అందించారు. బుధవారం ఒడిషాకు చెంది న కుటుంబాలను పిలిచి రూ. 15లక్షల చొప్పున ఇచ్చారు.
దీంతో కొన్ని కుటుంబాలకు రూ. 25లక్షల చొప్పున అందాయి. రూ. కోటి వాగ్దానం కూడా నెరవేరుస్తామని, మీరు సంయమనంతో ఉండాలని పరిశ్రమ ప్రతినిధులు ఆయా కుటుంబాలతో విన్నవించుకుంటున్నాయి. బుధవారం బీహార్ కార్మికుడు లక్ష్మీముఖియా కుటుంబ సభ్యులను రప్పించి రూ. 25లక్షలు పాశమైలారంలో అందజేశారు. కుటుంబ సభ్యులు పరిశ్రమను కూడా చూస్తామని కోరడంతో భార్య రాధకుమారి, తమ్ముడు లక్ష్మణకు ఫ్యాక్టరీని చూపించారు. మృతి చెందిన ప్రొడక్షన్ బ్లాక్‌ను కూడా వారికి చూపడంతో భావోద్వేగానికి గురయ్యారు.
పరిష్కారం దిశగా సమస్య
కార్పొరేట్ యాజమాన్యాల తీరుతో ఇటు ప్రభుత్వ అధికారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జాతీయ స్థాయి నాయకులతో సం బంధాలు ఉన్న పరిశ్రమ యాజమాన్యాన్ని ఒప్పించడం తలకుమించిన భారం కావడంతో జిల్లా స్థాయి అధికారుల తలలు పట్టుకుంటున్నారు. సమస్య తీవ్రతను తెలుసుకున్న హరీశ్‌రావు బాధితుల పక్షంవైపు రంగంలోకి దిగి పరిశ్రమ యాజమాన్యం, కాంగ్రెస్ సర్కార్‌పై ధ్వజమెత్తడంతో సమస్య పరిష్కారం దిశగా వెళ్తున్నది.
హరీశ్‌రావు సంగారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చి ప్రజావాణిలో బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరడంతోనే సమస్య పరిష్కారం బాధ్యత సర్కారుపై పడింది. కార్పొరేట్ యాజమాన్యం వద్ద డబ్బులు ఇప్పించేందుకు ఉన్న ఆటంకాలు కూడా కొద్ది కొద్దిగా క్లియర్ కావడం వల్ల అధికారుల్లో టెన్షన్ తగ్గింది. పైకి చెప్పకున్నా చాలాశాఖల అధికారులు హరీశ్‌రావు డైనమిక్ నిలదీతను మెచ్చుకుంటున్నారు. మరో పక్క గాయాలకు గురైనవారికి నష్టపరిహారం చెల్పించాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది.
డెత్ సర్టిఫికెట్లు అందజేత
డెత్ సర్టిఫికెట్, పంచనామా కాపీలు ఎందుకు ఇవ్వరు అని హరీశ్‌రావు అడగడంతో ఇప్పుడు ఆ సమస్య కూడా తీరింది. 38మందికి డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని అధికారులు ఇస్నాపూర్ మున్సిపాలిటీ సిబ్బందికి ఆదేశాలు ఇవ్వగా వారు అందరికీ డెత్ సర్టిఫికెట్లు ఇచ్చారు. దవాఖానలో మృతిచెందిన వ్యక్తులకు దగ్గరలోని మున్సిపాలిటీల్లో డెత్ సర్టిఫికెట్లు ఇస్తారు. మిస్సింగ్ వ్యక్తుల కుటుంబాలకు డెత్ సర్టిఫికెట్స్కోసం అధికారులు పనులు ప్రారంభించారు.
పోలీసులు, రెవెన్యూ శాఖల పంచనామా, ఎఫ్ఐఆర్ కాపీలు కూడా బాధితులకు అందజేస్తున్నారు. మరో పక్క హరీశ్‌రావు సంగారెడ్డి కలెక్టరెట్లో బాధిత కుటుంబాలతో చేసిన పోరాటాన్ని టీవీల్లో ప్రత్యేక్షంగా చూసిన హిందీ రాష్ర్టాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి పత్రికల్లో వచ్చిన కథనాలను వారి హిందీ, ఒరియా భాషల్లోనూ (గుగూల్లో ట్రాన్స్‌లేట్ చేసి) చదివి హరీశ్‌రావును కొనియాడుతున్నారు. హరీశ్‌రావు సాబ్ ‘బహుత్ మెహనత్ కర్కె హమారే పైసె దిల్హారే’ అంటూ అక్కడి మీడియాలో ప్రచారం చేస్తున్నారు.