సిద్దిపేట, జూలై 11: పౌరులకు రాజ్యాంగం కల్పించిన గొప్ప హక్కు ఓటు అని, ప్రతి ఓటు కీలకం కాబట్టి, సర్ ప్రక్రియలో ఒక్క ఓటు పోకుండా బూత్ లెవల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ప్రతి ఒక ఓటరు ఎస్ఐఆర్ ఫారాన్ని నింపి బీఎల్ఓకు అందించేందుకు బూత్ లెవల్ ఏజెంట్లు కీలకంగా పనిచేయాలని సూచించారు. శనివారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై బీఆర్ఎస్ బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశంనిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ జరుగుతున్న తీరును ఏజెంట్లను హరీశ్‌రావు అడిగి తెలుసుకున్నారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ.. బూత్ లెవెల్ ఏజెంట్లు ప్రతి ఓటర్ను కలిసి, వారికి ఓటు విలువను వివరించి చైతన్య పర్చాలన్నారు.
ఎస్ఐఆర్ అత్యంత కీలకమైన అంశమని, ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్న రాజ్యాంగ స్ఫూర్తి ఆధారంగా దొంగ ఓట్లు లేకుండా చూడాలని హరీశ్‌రావు సూచించారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్లు సమర్థవంతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఎస్ఐఆర్ ప్రక్రియపై అయోమయంలో ఉన్నారని, కొందరు నిర్లక్ష్యంతో ఉండవచ్చని, వారి ఇంటికి వెళ్లి సర్ గురించి వివరించి దరఖాస్తు చేసేలా కృషిచేయాలన్నారు. బూత్ లెవెల్ అధికారులతో సమన్వయం చేసుకొని ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రజలను భాగస్వామ్యం చేసే బాధ్యత బూత్ ఏజెంట్లది అన్నారు.
నూతన ఓటర్ల నమోదును ఎల్లప్పుడూ అవకాశం ఉంటుందని, 18 ఏండ్లు నిండిన వారిని సైతం ఓటర్లుగా నమోదు చేసేందుకు ఫారం నెంబర్ 6ను నింపాలని హరీశ్‌రావు సూచించారు. తల్లిదండ్రులు ఇకడే ఉండి కొడుకులు, కోడళ్లు ఇతర ప్రాంతాల్లో నివసించే వారితో మాట్లాడి, వారు ఎకడ ఓటును ఉండాలని కోరుతారో అడిగి తెలుసుకోవాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున డబుల్ ఓట్లు, ఇతర ప్రాంతాల వారిని, ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లుగా నమోదైన వారిని ఇకడ ఓటర్లుగా నమోదు చేయించే ప్రయత్నాలు చేస్తున్నారని, ఇలాంటి వాటిని ముందుగానే గుర్తించాలన్నారు.
బీఆర్ఎస్ కార్యకర్తలు మద్దతుదారుల ఓట్లు పోయే ప్రయత్నం చేసే ప్రమాదం ఉన్నందున, ప్రతి ఓటు కీలకంగా భావించి ఎన్యుమరేషన్ ఫారం నింపి బూత్ లెవెల్ అధికారి వద్ద నమోదు చేయించాలని బీఎల్ఏలకు హరీశ్‌రావు సూచించారు. ఒక ఓటు కూడా అన్యాయంగా తొలిగించకుండా చూసే బాధ్యత బూత్ లెవెల్ ఏజెంట్లు తీసుకోవాలన్నారు. డబుల్ ఓట్ల పైన పార్టీ శ్రేణులు దృష్టి సారించాలని సూచించారు.
ఎస్ఐఆర్కు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలను, సమస్యలను ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని హరీశ్‌రావు సూచించారు. బూత్ లెవెల్ ఏజెంట్లు, కార్యకర్తలు, పార్టీ కౌన్సిలర్ల సహకారంతో ఎస్ఐఆర్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలన్నారు. ఈనెల 25వ తేదీలోపు ప్రతి ఓటరు వద్దకు వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలు నింపి దరఖాస్తు చేయించాలన్నారు. అనంతరం సిద్దిపేటలోని నాసర్‌పురా 32వార్డులో బూత్ ఏజెంట్స్‌గా పనిచేసి హైహెస్ట్ ఎన్యూమరేషన్, ఓటు నమోదు చేసినందుకు 108 బూత్ ఏజెంట్స్ వంశీ, రాజు, 109 బూత్ ఏజెంట్స్ నర్సింలును హరీశ్‌రావు అభినందించి శాలువాలతో సతరించారు.