నర్సాపూర్, సెప్టెంబర్ 1: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు దండుకోడానికే కాంగ్రెస్ ప్రభు త్వం కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తూ అసెంబ్లీలో చర్చపెట్టిందని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. బీడు భూములకు సాగునీరందించిన గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరమన్నారు. పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు అని డిస్కవరీ చానల్లోనే గొప్పగా చెప్పడం జరిగిందని, సుప్రీంకోర్టు సైతం కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు అని ప్రశంసించిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే ఘోష్ కమిషన్ రిపోర్టు కాళేశ్వరానికి వ్యతిరేకంగా వచ్చిందని భావిస్తున్నామన్నారు.
మంత్రులు అడిగిన ప్రశ్నలకు మాజీ మంత్రి హరీశ్‌రావు సరైన సమాధానం చెప్పారన్నారు. కావాలనే కుట్రపూరితంగా కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందని మండిపడ్డారు. హరీశ్‌రావు అసెంబ్లీలో మాట్లాడుతుంటే వాస్తవాలు బయటకు వస్తున్నాయనే భయంతో సీఎం, మంత్రులు అడ్డుకున్నారన్నారు. 20 లక్షల ఎకరాలకు సాగునీరు అం దించిన గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం అని అభిప్రాయపడ్డారు. వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని సీఎం, మంత్రులు ప్రగల్భా లు పలుకుతున్నారని, ఆ నీరు కాళేశ్వరం నుం చే వస్తున్నదని గుర్తుచేశారు. మాజీ సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావును బద్నాం చేయాలని కాంగ్రెస్ కంకణం కట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేడిగడ్డ రెండు పిల్లర్లు కుంగిపోవటానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని రిటైర్డు ఐపీఎస్ అధికారి ప్రవీణ్ చెప్పినట్లు గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయాలని, బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. మేడిగడ్డలోని రెండు పిల్లర్లను బాగు చేయిస్తామని కాంట్రాక్టర్లు ముందుకు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గంధమల్లలో రిజర్వాయర్‌కు సీఎం రేవంత్‌రెడ్డి భూమిపూజ చేశారని, గంధమల్లకు మల్లన్నసాగర్ నుంచే నీరు వస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎస్ఎల్బీసీ కూలిపోతే అక్కడికి ఎన్డీఎస్సీ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ప్రతి సంవత్సం లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఒక చెక్‌డ్యామ్‌ను కూడా నిర్మించలేదని ఎద్దేవా చేశారు.
ఒక ప్రాజెక్టు కూడా కట్టకపోగా ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టులను కూల్చే ప్రయత్నం చేస్తుందన్నారు. ఎరువుల కోసం రైతులు రోడ్లపై ధర్నా చేస్తుంటే అది బీఆర్ఎస్ పార్టీ సృష్టిస్తుందని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. యూరియా, వరదల గురించి అసెంబ్లీలో చర్చిద్దామంటే ప్రభుత్వం వెనుకడుగువేస్తుందన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తీసుకురావడం చాలా సంతోషమన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్ప డం ఖాయమన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ అశోక్‌గౌడ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సత్యంగౌడ్, జడ్పీ కో-ఆప్షన్ మాజీ సభ్యుడు మన్సూర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, బీఆర్ఎస్ నాయకులు షేక్‌హుస్సేన్, విఠల్‌గుప్తా, నర్సింహులు, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.