రామాయంపేట, నవంబర్ 10: జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ డబ్బులకు అమ్ముడుపోతున్నాయని, డబ్బులకు టికెట్లిచ్చే సంస్కృతి పోవాలంటే రెండు పార్టీలను భూస్తాపితం చేయాలని బీజేపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నందు జనార్దన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడినై తాను బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఐటీ శాఖ మంత్రి కే.తారకరామారావు సమక్షంలో మంత్రి స్వగృహంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జనార్దన్‌రెడ్డికి మంత్రి గులాబీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతోపాటు మరో 50 మంది తన అనుచరులను కూడా గులాబీ పార్టీలో చేర్పించారు. అనంతరం జనార్దన్‌రెడ్డి రామాయంపేటలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రోజురోజుకు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లు డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నాయన్నారు. డబ్బులకు టికెట్లిచ్చే సంస్కృతి పోవాలంటే రెండు పార్టీలను భూస్తాపితం చేయాలన్నారు.
బీజేపీలో తన శక్తిమేర కింది స్థాయి కార్యకర్త నుంచి పార్టీకి పని చేయించానని, అయినా పార్టీలో ఎలాంటి గుర్తింపు ఇవ్వకుండా కనీస సభ్యత్వం కూడా లేనివారికి అప్పటికప్పుడు డబ్బుల ఎరతో టిక్కెట్లు ఇస్తున్నారన్నారు. అందుకే పార్టీ విధానాలు నచ్చకే బీజేపీ నుంచి తన కార్యకర్తలతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు జనార్దన్‌రెడ్డి తెలిపారు. బీజేపీలో కష్టపడి పనిచేసే వారికి భవిష్యత్ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అభివృద్ధికి తన టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, నాలుగేండ్ల క్రితం బీజేపీలో చేరానన్నారు. బీజేపీ బలోపేతానికి ఎనలేని కృషి చేశానన్నారు. పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసిన తనను దూరం పెట్టి, నిన్న మొన్న వచ్చిన వారికే టికెట్లు ఇస్తున్నారని తెలిపారు. తీవ్ర మనస్తాపానికి గురైన తాను బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో తన అనుచరులతో కేటీఆర్ సమక్షంలో చేరానన్నారు. మంత్రిని కలిసిన వారిలో ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్‌రెడ్డి, మెదక్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పొడెండ్ల లక్ష్మణ్‌యాదవ్, కొండల్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, రమేశ్‌గుప్తా తదితరులు ఉన్నారు.