జహీరాబాద్, మే 2: తెలంగాణను కేంద్ర బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణకు మోదీ సర్కారు అన్యా యం తప్ప ఏం చేయలేదని మండిపడ్డారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆయన విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లో హరీశ్‌రావు నివాసంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ఆధ్వర్యంలో న్యాల్కల్ మండలంలోని రత్నాపూర్‌కు చెందిన 50 మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరా రు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు రత్నాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ రవికుమార్, సీనియర్ నాయకులు తుకారం, బస్వరాజ్, సంగ్‌శెట్టి, సంజీవ్, అమృత్ తదితరులను కండువాలను వేసి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ చిన్నచూపు చూస్తోందన్నారు. తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని దుయ్యబట్టారు. ప్రధానంగా కరెంట్ సమస్యలు, రైతుభరోసా, రైతు రుణమాఫీ, బీమా వంటి పథకాలకు తిలోదకాలు ఇచ్చిందని ధ్వజమెత్తారు. సంగారెడ్డి జల్లా అభివృద్ధిని కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తున్నదని, ఎన్డీఎఫ్, టీపీఐడీసీ నిధులను విడుదల చేయకుండా అన్యాయం చేస్తున్నదన్నారు. బీఆర్ఎస్ పాలనలో పూజచేసిన బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టిందన్నారు.
సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఈ ఎత్తిపోతలకు కేసీఆర్ శ్రీకారం చుడితే, ప్రస్తుత కాంగ్రెస్ దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఆ పనులు ఆపేసిందన్నారు. రైతులు, ప్రజల సమస్యల సాధన కోసం పోరాడే శక్తి బీఆర్ఎస్కు మాత్రమే ఉందని, బీఆర్ఎస్ ఎప్పుడూ పేదలు, తెలంగాణ ప్రజల పక్షాన నిలుస్తుందని హరీశ్‌రావు పేర్కొన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ న్యాల్కల్, కోహీర్ మండలాల అధ్యక్షులు రవీందర్, నర్సింలు, మాజీ ఎంపీటీసీ దేశెట్టి పాటిల్, మండల నాయకులు ఎంఆర్ ప్రవీణ్‌కుమార్, పడకంటి వెంకట్ పాల్గొన్నారు.