నర్సాపూర్ : గత 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ హయాంలో విపరీతమైన కరెంటు కోతలు ఉండేవని, పెద్ద పెద్ద పరిశ్రమల యజమానులు చైనా, జపాన్, రష్యా తదితర దేశాల నుండి లక్షల కోట్లు వెచ్చించి జనరేటర్లు తీసుకువచ్చారని బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ వెల్లడించారు. శనివారం నర్సాపూర్ పట్టణంలోని బిజెపి కార్యాలయంలో కేంద్ర బిజెపి ప్రభుత్వం తగ్గించిన జిఎస్టి ధరలపై విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వాళ్దాస్ మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్తును మెరుగుపరిచిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు, చెక్ డ్యాములు, ప్రాజెక్టులు పూర్తిగా నిండాయని, కానీ 10 నిమిషాలకు ఒకసారి కరెంట్ పోతుందని ఎద్దేవా చేశారు. దేశంలోని మిగతా రాష్ట్రాలలో పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం జరిగిందని, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురాలేకపోయిందని గుర్తు చేశారు. జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే నేడు పెట్రోల్ డీజిల్ సుమారు 15 రూపాయల వరకు తగ్గేదని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని, దీనికిగాను కేంద్ర ప్రభుత్వం మొదటి విడత బిల్లుగా ఒక్కో లబ్ధిదారునికి 1.25 లక్షల డబ్బులు రాష్ట్రానికి పంపిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని నాలుగు స్లాబ్ ల నుండి రెండు స్లాబుల వరకు చేయడం జరిగిందని దీనితో సామాన్య ప్రజలకు, వ్యాపారస్తులకు ఉపశమనం లభించిందన్నారు. జిఎస్టి తగ్గడంతో వస్తువులపై, వాహనాలపై, నిర్మాణాలపై భారం తగ్గుతుందని అన్నారు. ఈనెల 22 నుండి జీఎస్టీ తగ్గింపు ధరలు అమలులోకి వస్తుందని వస్తువులు కొనుగోలు చేసేవారు ఈ రెండు రోజులు ఓపిక పట్టాలని సూచించారు. జీఎస్టీ తగ్గింపుపై ప్రజలకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రమేష్ గౌడ్, అంజి గౌడ్, అరవింద్ గౌడ్, చంద్రయ్య, సురేష్, చిన్న రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.