హుస్నాబాద్, డిసెంబర్ 1 : దేశంలో మళ్లీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలపై ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నదని, స్వచ్ఛందంగా పనిచేసే సంస్థలను అధికార పార్టీలు తమ సొంతానికి వాడుకోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం హుస్నాబాద్‌లోని అనబేరి సింగిరెడ్డి స్మారక భవన్లో నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం హయాంలో చట్టాల ఉల్లంఘనలు కోకొల్లలుగా జరుగుతున్నాయని ఆరోపించారు.
బీజేపీయేతర రాష్ర్టాల్లో తమ ఆధీనంలోని ఈడీ, సీబీఐ సంస్థలతో కక్షపూరితంగా దాడులకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వాల విధానాలతో కోర్టులు, ప్రభుత్వ శాఖలు కూడా తమ పనిని సక్రమంగా చేసుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో స్కీములు స్కాములుగా మారుతున్నాయని, ప్రజాప్రతినిధులు సంపాదనే ధ్యేయంగా పనిచేయడం బాధాకరమన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు వ్యాపార దృష్టితో కాకుండా సేవా దృక్పథంతో పనిచేస్తే ఎలాంటి అవినీతి జరుగదన్నారు. దేశంలో ఇప్పటి వరకు నేర చరిత్ర గల ప్రజాప్రతినిధుల కేసులు 5,980 పెండింగ్‌లో ఉన్నాయని, వీటిని పరిష్కరిస్తే నేరానికి పాల్పడిన వారందరికీ శిక్షలు పడతాయన్నారు. దీంతో రాజకీయ నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సీపీఐ ఎల్లవేళలా ఉద్యమిస్తుందని, రాబోయే రోజుల్లో రాజ్యాంగానికి విరుద్ధంగా పనిచేసే ప్రభుత్వాలపై పోరాటాలు చేస్తామన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మం ద పవన్, నాయకులు గడిపె మల్లేశ్, కొయ్యడ సృజన్‌కుమార్, ఎడల వనేశ్, బోయిని అశోక్, గూడ పద్మ, జనార్దన్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.