టేక్మాల్, డిసెంబర్ 19 ః ఇటీవల అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్‌పై పల్వంచ గ్రామానికి చెందిన భూమయ్య చేసిన తప్పుడు ఆరోపణలు నిజం కావని బీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ఖండించారు. మంగళవారం మండలంలోని ప్రెస్‌క్లబ్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు భక్తుల వీరప్ప మాట్లాడుతూ ఎన్నికల ముందు ఏడాది కాలంగా కాంగ్రెస్‌లోనే ఉంటూ నేడు ఎన్నికలైన తర్వత మాజీ ఎమ్మెల్యే దళిత బంధు విషయంలో డబ్బులు తీసుకున్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఏడాది క్రితం కాంగ్రెస్ పార్టీలో చేరి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాడని గుర్తుచేశారు.
ఇకపై నిరాధార ఆరోపణలు చేస్తూ అవాకులు, చవాకులు పేలితే తగిన బుద్ధి చెబుతామన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే దామోదర్ మరికొందరు నాయకుల ప్రోద్భలంతో భూమయ్య ఇలాంటి ఆరోపణలు చేశారని, తమ నాయకుడిపై విమర్శలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునేలా కార్యాచరణ చేపడతామని పేర్కొన్నారు. మండల ప్రధాన కార్యదర్శి అవినాష్, జిల్లా బీఆర్ఎస్ యువత కార్యదర్శి నాయికోటి భాస్కర్, పాల్వంచ సర్పంచ్ శివకుమార్, మాజీ ఎంపీటీసీ సిద్ధన్న, సీనియర్ నాయకులు సలీం, చంద్రశేఖర్ రెడ్డి, సలావుద్దీన్, సత్యగౌడ్, గోవింద్ చారి, రవితో పాటు పల్వంచ గ్రామ దళిత బంధు లబ్ధిదారులు ఉన్నారు.