జహీరాబాద్, ఫిబ్రవరి 18: నిమ్జ్ భూబాధితులకు జనరల్ అవార్డు కింద మెరుగైన పరిహారాన్ని చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ రాజు తెలిపారు. న్యాల్కల్ మండలంలోని హద్నూర్, గుంజోట్టి గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నిమ్జ్ భూబాధితులతో మంగళవారం సమావేశాన్ని నిర్వహించారు. రెండు, మూడు పంటల పండే సారవంతమైన భూములను తీసుకోవద్దని, వాటిపైనే అధారపడి కుటుంబాలను పోషించుకుంటున్నామని రైతులు విజ్ఞప్తి చేశారు.
పట్టా, ప్రభుత్వ భూమికి సమానంగా పరిహారం చెల్లించాలన్నారు. అనంతరం నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ .. మార్చిలో పరిహారాన్ని ఇస్తామని, పట్టా, ప్రభుత్వ భూములకు రూ. 15 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామన్నారు. భూబాధితులు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో మండల డిప్యూటీ తహసీల్దార్ రాజిరెడ్డి, నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ తహసీల్దార్ సతీష్, ఆర్ఐ సిద్ధారెడ్డి, పంచాయతీ కార్యదర్ళులు ధన్రాజ్, సంతోష్, రైతులు పాల్గొన్నారు.