BC Bandh | పటాన్చెరు, అక్టోబర్ 18 : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర బంద్‌కు పిలుపు ఇవ్వడంతో పటాన్చెరులో బంద్ సంపూర్ణంగా జరుగుతుంది. శనివారం ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బీసీ సంఘాల నాయకులు బంద్‌ను విజయవంతం చేసేందుకు వ్యాపార వాణిజ్య సంస్థలను మూసివేయించారు. విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలోని పటాన్చెరు, ఇస్నాపూర్, రామచంద్రపురం, జిన్నారం, అమీన్పూర్, గుమ్మడిదల తదితర ప్రాంతాల్లో బీసీ సంఘాల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. బంద్ సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పటాన్చెరు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలలో వెళ్లిపోవడం జరిగింది. ప్రైవేట్ వాహనాల వారు ప్రయాణికుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు.