మెదక్ రూరల్, మార్చి 10: సమాజంలో పురుషులు, మహిళలందరూ సమానమేనని, మహిళలు విద్యతోపాటు తమలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి ధైర్యంగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా శుక్రవారం, స్థానిక టీఎన్జీవోస్ భవన్లో ఎన్జీవోల సంఘం మహిళా శిశు సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నదని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళ క్లినిక్‌లు ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు.
రాష్ట్రస్థాయిలో ఉత్తమ అంగన్వాడీ హెల్పర్‌గా ఎంపికైన కౌడిపల్లికి చెందిన రజియా సుల్తానాను కలెక్టర్ సన్మానించారు. ఉత్తమ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, వివిధ శాఖల మహిళా ఉద్యోగినులు తదితరులను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి, బ్రహ్మాజి, టీఎన్జీవో అధ్యక్షుడు నరేందర్ జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, జిల్లా సహకార అధికారి కరుణ, మోప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఇందిర, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి రాజ్‌కుమార్, ఉపాధ్యక్షురాలు అనురాధ, కార్యవర్గ సభ్యులు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, వివిధ శాఖల ఉద్యోగినులు తదితరులు పాల్గొన్నారు.