అభివృద్ధి, సంక్షేమంతో పాటు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా మారిందని బీఆర్ఎస్ జిల్లా ఇన్‌చార్జ్జి, ఎమ్మెల్సీ బోడెకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా తూప్రాన్ మండలం ఘనపూర్ శివారులో నిర్వహించిన తూప్రాన్ రూరల్ మండల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీగా హాజరైన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు కేసీఆర్ పంపించిన ఆత్మీయ సమ్మేళన సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం ఇమాంపూర్‌కు చెందిన శామీర్‌పేట ఎల్లం భార్య రేణుకకు రూ.2 లక్షల బీమా చెక్కు అందజేశారు. ఈ సందర్భంగా బోడెకుంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దేశంలో కిసార్ సర్కారు అధికారంలోకి రావడం తథ్యమని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మండుటెండల్లో గోదావరి జలాలను మెతుకుసీమలో పరవళ్లు తొక్కించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితోనే ఆకలి కేకల నుంచి అన్నపూర్ణగా తెలంగాణ అవతరించిందని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు.
తూప్రాన్, ఏప్రిల్ 4: అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదం దేశంలో మార్మోగుతోందని, త్వరలో దేశంలో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ కిసాన్ సర్కార్‌ను ఏర్పాటు చేయడం ఖాయమని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సిద్దిపేట జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ బోడెకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీ తూప్రాన్ మండల అధ్యక్షుడు బొల్లంపల్లి బాబుల్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం తూప్రాన్ రూరల్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మండలంలోని ఘనపూర్ శివారులోని ఎస్ఎఫ్ గార్డెన్స్‌లో జరిగిన ఈ సమ్మేళనానికి ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ భూంరెడ్డితో కలిసి బోడెకుంటి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భారీగా హాజరైన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు కేసీఆర్ పంపించిన ఆత్మీయ సమ్మేళన సందేశాన్ని చదివి వినిపించారు. అనంతరం ఇమాంపూర్ గ్రామ కార్యకర్త శామీర్‌పేట ఎల్లం ప్రమాదవశాత్తు చనిపోగా, ఆయన భార్య రేణుకకు రూ.2 లక్షల బీమా చెక్కు అందజేశారు. అనంతరం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడా లేనటువంటి సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే ప్రవేశపెట్టిన ఘనత ఒక్క కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఎన్నో సంవత్సరాలు గుజరాత్‌ను పాలించిన మోదీ తన సొంత రాష్ట్రంలో ఇప్పటికీ రైతులకు సరైన విద్యుత్ లభించడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వాల హయాంలో హైదరాబాద్ ఇందిరా పార్కు దగ్గర నిత్యం ధర్నాలు జరుగుతుండేవని, అసెంబ్లీ జరుగుతుంటే లాంతర్లు, ఎండుగడ్డి పట్టుకొచ్చేవారన్నారు. కానీ, కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ సమస్య పూర్తిగా సమసిపోయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో, దేశంలో బీఆర్ఎస్ ప్రభంజనం సృష్టించబోతుందన్నారు. ముచ్చటగా మూడోసారి 105 సీట్లతో హ్యాట్రిక్ సాధించడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేక మోడీ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోందని, మెట్రో రైలు, కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకపోగా, కేంద్రం తెలంగాణాపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు.
మండుటెండల్లో గోదావరిని పరవళ్లు తొక్కించిన ఘనత అపర భగీరథుడు కేసీఆర్‌కే దక్కుతుందని మెదక్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలపించుకోవాలని కోరారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని అందనంత ఎత్తులో, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ ఆకలి కేకల నుంచి అన్నపూర్ణగా అవతరించిందని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలతో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. తెలంగాణ వస్తే ఏమొచ్చిందో గుర్తు చేసేందుకే ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు ఆశించిన దానికన్నా, ఊహించని దానికన్నా ఎక్కువ అభివృద్ధి చేసి చూయించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కులాల, మతాల మధ్య చిచ్చులు పెడుతూ లబ్ధి పొందాలని చూస్తోందే తప్ప తెలంగాణకు ఏం చేశారో, ఏం చేస్తారో చెప్పే దమ్ము బీజేపీ నాయకులకు లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కరెంటు, తాగునీరు, సాగునీటికి కటకటేనన్నారు. కేసీఆర్ సేవ కోసం యావత్ దేశం తెలంగాణవైపే చూస్తోందన్నారు. సమ్మేళనంలో ఎంపీపీ గడ్డి స్వప్నావెంకటేశ్ యాదవ్, జడ్పీటీసీ రాణీసత్యనారాయణగౌడ్, కేసీఆర్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్కుల మహిపాల్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి, మనోహరాబాద్ మండలాధ్యక్షుడు పురం మహేశ్, ఆత్మ కమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, నాచగగిరి ఆలయ మాజీ చైర్మన్ కొట్టాల యాదగిరి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు భగవాన్‌రెడ్డి, మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షులు, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.