గీసుగొండ, మార్చి 3 : హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నుంచి కొండా సురేఖను ఎమ్మెల్యేగా చేస్తానని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గీసుగొండ మండలం కొమ్మాల జాతర సందర్భంగా మంగళవారం అనుచరులు ఏర్పాటు చేసిన కొండా కాంగ్రెస్ రాజకీయ ప్రభ బండిని మురళీధర్‌రావు, ఆయన కుమార్తె సుస్మితా పటేల్ కొమ్మాల స్టేజీ వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో పరకాల నుంచి కొండా సురేఖను, వరంగల్ నుంచి సుస్మితా పటేల్‌ను ఎమ్మెల్యేలుగా చేయడమే తన లక్ష్యమని అన్నారు. గీసుగొండ మండలం తనకు రాజకీయ భిక్షపెట్టిందని, ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి మంత్రి కొండా సురేఖ, మురళీధర్‌రావు దంపతుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న విషయ తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డికి చెక్ పెట్టేందుకేనా అని స్థానికులు చర్చించుకుంటున్నారు.