Robbery | పాపన్నపేట, నవంబర్ 26 :ఆధ్యాత్మిక కేంద్రంలో అలజడి చెలరేగింది. ఏడు పాయల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో దోపిడి జరిగింది. కొందరు ఆగంతకులు రివాల్వర్‌తో బెదిరించి హల్చల్ చేశారు. విందు ముగించుకొని సరదాగా పేకాట ఆడుతున్న వారిపై దాడికి తెగ బడ్డారు. ఆపై దర్జాగా రెండున్నర లక్షలు దోచుకెళ్లారు. మంగళ వారం రాత్రి జరిగిన సంఘటన కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అది అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల.
దుర్గమ్మ తల్లి సన్నిధిలో సుమారు 60మంది భక్తులు హీరాలాల్ షెడ్లో అర్ధరాత్రి సేద తీరుతున్నారు. అర్ధరాత్రి కావడంతో అంతా నిశ్శబ్ద వాతావరణం, అదే సమయంలో వారు సేద తీరుతున్న హీరాలాల్ గెస్ట్ హౌస్ గేటు దూకి మూకుమ్మడిగా 10 మంది దుండగులు లోనికి చొరబడ్డారు. కొందరు మొదటి గేటు వద్ద కాపలా ఉండగా మరికొందరు రెండో గేటు కాడ పహారా కాశారు. మరో 6 మంది షెడ్లోనికి చొరబడ్డారు. చొరబడ్డ దుండగుల వద్ద రివాల్వర్ ఉండడంతో వారు దాంతో భక్తులను బెదిరించారు. 60 మంది వరకు ఉన్న భక్తులు రివాల్వర్ చూసి కిమ్మనలేక నిచ్చేష్ఠులయ్యారు.
ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతున్నా..
దుండగులు లోనికి ప్రవేశించగానే రివాల్వర్‌తో బెదిరించి, వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లన్నీ తమకు అప్పగించాల్సిందిగా హుకుం జారీ చేశారు. భయభ్రాంతులకు గురైన భక్తులు అందరి సెల్ ఫోన్లు తీసి దుండగులకు అప్పగించారు. అందులో నుండి తేరుకున్న మెదక్ పట్టణానికి చెందిన ధర్మాకర్ రాజు అనే యువకుడు వారిని అడ్డగించే ప్రయత్నం చేశాడు. అయితే ఆ వెంటనే దుండగులు అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. తోటి భక్తుడిపై దాడితో భయ భ్రాంతులకు గురైన మిగతా భక్తులు నిచ్చేష్ఠులై వారి వద్ద ఉన్న రెండున్నర లక్షలు దుండగులకు అప్పగించారు.
అవి అందగానే దుండగులు గోడ దూకి పరారయ్యారు. ఏడుపాయలలో ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతున్నా ఇవి ఏమాత్రం బయటకు పొక్కడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
రివాల్వర్ చూసి భయపడ్డాం : భక్తుడు ధర్మాకర్ రాజు, మెదక్
మేము ఏడుపాయల దుర్గమ్మ సన్నిధిలో మంగళవారం విందు ఏర్పాటు చేసుకున్నాం, అర్ధరాత్రి కొంతమంది సేద తీరుతుండగా మరి కొంతమంది పేకాట ఆడుతున్నారు. అదే సమయంలో పది మంది వరకు దుండగులు రివాల్వర్‌తో వచ్చారు. వారిని చూసి అందరూ భయపడ్డారు నేనొక్కడిని ఎదుర్కొనే ప్రయత్నం చేశా నాపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దాంతో నేను కూడా చేసేదేం లేక సరెండర్ అయ్యాను. ఆపై దుండగులు మా వద్ద ఉన్న రెండున్నర లక్షల నగదు ఎత్తుకొని పరారయ్యారు.

Nalgonda City : ‘అందరి హక్కులకు రక్షణ భారత రాజ్యాంగం’
Nalgonda City : ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
Donations | టీటీడీకి రూ.9 కోట్లు విరాళం ..దాతను అభినందించిన చైర్మన్